పల్లె దవాఖానాపై పట్టింపేది | - | Sakshi
Sakshi News home page

పల్లె దవాఖానాపై పట్టింపేది

Apr 29 2026 7:18 AM | Updated on Apr 29 2026 7:18 AM

పేదలకు అందని వైద్యసేవలు

కొన్ని కేంద్రాలు డిప్యుటేషన్‌తో మూత.. మరికొన్ని వైద్యులున్నా సక్రమంగా

తెరుచుకోని వైనం

సమయపాలన పాటించని సిబ్బంది.. మధ్యాహ్నానికే మూత

నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం

ఉన్నతాధికారులకు

ఫిర్యాదు చేశాం..

గ్రామంలోని పల్లె దవాఖానాకు వైద్యులు సక్రమంగా విధులకు రావడం లేదని కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేశాం. వైద్యులు రాక కేంద్రం మూతబడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌ఆర్‌ఐ ముందుకొచ్చి భవనం నిర్మించి వసతులు కల్పిస్తే వైద్యులు రాకపో వడం సరికాదు. జిల్లా అధికారులు స్పందించి రెగ్యులర్‌ వైద్యుడిని నియమించి కేంద్రం తెరిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి.

– రేగిచెట్టు నిరంజన్‌, సర్పంచ్‌, రేమద్దుల

వైద్యులు లేక

మూతబడిన కేంద్రం..

పల్లె దవాఖానాలోని ఎంఎల్‌హెచ్‌పీ వైద్యుడు డిప్యుటేషన్‌పై జిల్లాకేంద్రానికి వెళ్లడంతో మూతబడింది. సిబ్బంది కూడా వ్యాక్సిన్‌ ఉన్న బుధవారం రోజు మాత్రమే తెరిచి మిగతా రోజులు మూసి ఉంచుతున్నారు. అత్యవసర సమయంలో వైద్యసేవల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారులు స్పందించి డిప్యుటేషన్‌ రద్దుచేసి కేంద్రంలో వైద్యుడు ఉండేలా చూడాలి.

– జంబులయ్య, సర్పంచ్‌, తెల్లరాళ్లపల్లి

డిప్యుటేషన్‌ విషయాన్నిపరిశీలిస్తాం..

పల్లె ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశాం. అలాంటివి మూతబడటానికి వీలు లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంచాలి. కేంద్రాలకు వెళ్లని, సమయపాలన పాటించని సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఎంఎల్‌హెచ్‌పీలు డిప్యుటేషన్‌పై వెళ్లిన విషయాన్ని పరిశీలిస్తాం.

– డా. సాయినాథ్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి

పాన్‌గల్‌: పల్లె దవాఖానా.. కొన్నాళ్ల కిందట ఈ పేరు వినగానే ప్రభుత్వ వైద్య సేవలపై పేదలకు ఓ విశ్వాసం కలిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మాదిరిగానే ఈ దవాఖాల్లోనూ వైద్యులుంటారని.. నిరంతర వైద్యసేవలు అందుతాయని నమ్మారు. కానీ.. వారు విశ్వసించిన స్థాయిలో ఈ దవాఖానాల్లో వైద్యసేవలు అందడం లేదు. కొన్ని కేంద్రాల్లో సిబ్బంది ఎప్పుడోస్తారో కూడా తెలియని పరిస్థితి ఉండగా.. మరికొన్ని చోట్ల సిబ్బంది కేంద్రాలను తెరిచే దిక్కే లేకుండా పోయింది. కొన్ని కేంద్రాల్లోని ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు డిప్యుటేషన్‌పై జిల్లాకేంద్రానికి, ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఆయా కేంద్రాలు మూతబడ్డాయి. ఉన్న కేంద్రాలకు వచ్చే ఎంఎల్‌హెచ్‌పీలు, సిబ్బంది ఎక్కడ కూడా సమయ పాలన పాటించడం లేదు. పల్లె దవాఖానాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంచాలనే నిబంధన ఉన్నా.. తాము వచ్చిందే సమయంగా భావించి మధ్యాహ్నానికే మూసి వెళ్తున్నారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందక ఇబ్బందులు తప్పడం లేదు.

నెరవేరని లక్ష్యం..

వైద్యసేవలు పల్లెలకూ విస్తరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. ఎంబీబీఎస్‌ లేదా బీహెచ్‌ఎంఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌ చేసిన వారిని ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాల పేరునే పల్లె దవాఖానాలుగా మారుస్తూ ఎంఎల్‌హెచ్‌పీ, ఒక ఏఎన్‌ఎం ఇక్కడ సేవలందించాలని ఆదేశించారు. కాగా క్షేత్రస్థాయిలో సిబ్బంది డిప్యుటేషన్‌పై వెళ్లడంతో మూడు కేంద్రాలు మూతబడ్డాయి. మరికొన్ని కేంద్రాల్లో నామమాత్రంగా విధులు నిర్వర్తిస్తుండటంతో ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె దవాఖానాలు కొనసాగాలంటే అధికారులు పర్యవేక్షణ చేస్తూ కేంద్రాలను నిర్దేశిత సమయం వరకు తెరిచి ఉండేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

‘పాన్‌గల్‌ మండలంలో 28 జీపీలకు ఒకే పీహెచ్‌సీ ఉంది. ఇందులో ఇద్దరు వైద్యులు

ఉండగా.. ఒకరు డిప్యుటేషన్‌పై కడుకుంట్ల పీహెచ్‌సీకి వెళ్లి ఏళ్లు గడుస్తోంది. ముగ్గురు

ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు, ఒక హెల్త్‌ అసిస్టెంట్‌ డిప్యుటేషన్లపై వెళ్లడంతో ఉన్న సిబ్బందిపై

అదనపు భారం పడుతోంది. మరో వైద్యుడు ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్తుండటంతో పేదలకు

సక్రమంగా వైద్యసేవలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’

Advertisement
 
Advertisement
Advertisement