పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులతో మంగళవారం ఉదయం వాహనదారులు జిల్లాలోని పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద బారులు తీరారు. ఆత్మకూర్, అమరచింత ఒక్కో మండలంలో మూడు బంకులు ఉండగా కేవలం ఒక్కో బంకులో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉండటంతో వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. పంట కోతల సమయం కావడంతో కోత యంత్రాలు, ట్రాక్టర్ల నిర్వాహకులు డ్రమ్ములను తీసుకొచ్చి డీజిల్ పోయించుకోవడం కనిపించింది. మిగిలిన బంకుల్లో నో–స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. అమరచింతలో పోలీసుల పహారాలో ఇంధనం సరఫరా చేయడం కనిపించింది. గోపాల్‌పేటలోని రెండు బంకుల్లో సాయంత్రం వరకు నో–స్టాక్ బోర్డులు కనిపించాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఓ బంకుకు పెట్రోల్ రావడంతో వాహనదారులు బారులు తీరారు. చెన్నారంలో మాత్రమే డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంది. రేమద్దుల పెట్రోల్ బంకులో మధ్యాహ్నం వరకు పెట్రోల్ విక్రయించారు.
– ఆత్మకూర్/అమరచింత/గోపాల్‌పేట


