సజావుగా ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

సజావుగా ధాన్యం కొనుగోళ్లు

Apr 29 2026 7:18 AM | Updated on Apr 29 2026 7:18 AM

కొత్తకోట రూరల్‌: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా తహసీల్దార్లు పర్యవేక్షణ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ రెవెన్యూ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో వెబెక్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఏక్యూ నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం సేకరించాలని, రైతులు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. సన్నరకం ధాన్యాన్ని గుర్తించాలని, సరిపడా గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు, హమాలీలకు తాగునీరు, నీడ వసతి కల్పించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సమకూర్చుకోవాలని సూచించారు. రైతులు తెచ్చిన ధాన్యం నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి కేటాయించిన మిల్లు, గోదాంకు తరలించాలని ఆదేశించారు. ట్యాబ్‌ ఎంట్రీలు వెంటనే పూర్తి కావాలని సూచించారు.

ఇంధన కొరత లేకుండా చర్యలు..

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా నిరంతరం కొనసాగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కొత్తకోట తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జిల్లాలోని ఆర్డీఓ సుబ్రమణ్యంతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు, ఇంధన అవుట్‌లెట్‌ డీలర్లు, ఎస్‌ఓలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యంగా వ్యవసాయ అవసరాలు, రవాణా, అత్యవసర సేవలకు ఇంధన కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే బంకుల్లో తగినంత నిల్వలు ఉండేలా పర్యవేక్షణ చేయాలని, రోజువారీ విక్రయాలు, నిల్వలపై సమగ్రంగా పరిశీలించాలని చెప్పారు. కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్రంగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement