వనపర్తి: మాదకద్రవ్యాల రహిత జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బాలల భద్రత, రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, డీఎస్పీ బాలాజీనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. సోమవారం నుంచి మే నెల రెండో తేదీ వరకు ప్రభుత్వం బాలల భద్రత, రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ చొరవతో జిల్లాకేంద్రంలోని బాలసదనం చిన్నారులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా చేయించి పత్రాలతో పాటు క్రీడా సామగ్రి అందజేశామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో బాల్య వివాహాలు కట్టడి చేయడంలో పురోగతి సాధించినట్లు చెప్పారు. డీఎస్పీ బాలాజీనాయక్ మాట్లాడుతూ.. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్తుకు బానిసైన వారిని మాన్పించేందుకు డి–అడిక్షన్ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా పది, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన బాలసదనం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మిషన్ వాత్సల్య దత్తతకు సంబంధించిన అడాప్షన్ హెల్ప్‌డెస్క్, పోస్టర్లును అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీపీఓ రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి..
ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలు వేగంగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 41 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు.


