వనపర్తి: స్థానిక డీఎస్పీగా జి.గిరిబాబు సోమవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీసు శిక్షణ కేంద్రంలో విధులు నిర్వహించిన ఈయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు సేవలందించిన వెంకటేశ్వరరావు హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డీఎస్పీ గిరిబాబు మాట్లాడుతూ.. వనపర్తి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల ను కాపాడటం తన బాధ్యతన్నారు. నేరాల నియంత్రణలో రాజీ ఉండదని, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతూ పోలీసింగ్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని పొందేవిధంగా పని చేస్తామని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని.. పోలీసు అధికారులు వారితో కలిసి పనిచేయాలని సూచించారు.
క్రీడలతో మానసికోల్లాసం
వీపనగండ్ల: క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం లభించడమేగాక క్రీడా నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని కల్వరాలలో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిక్షణతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారి రాముడు, ఉపసర్పంచ్ తడకల రంగమ్మ, జీహెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు వెంకటరాజయ్య, మండ్ల సురేష్, భాస్కర్, శివుడు, వెంకట్, గోపాల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాలకు
మృతదేహం అప్పగింత
ఆత్మకూర్: పట్టణానికి చెందిన విశ్రాంత డీఏఓ రాజశేఖరరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన మృదేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. వైద్య విద్యార్థులకు మృతదేహం ఉపయోగపడుతుందని, ఇందుకు ముందుకొచ్చిన రాజశేఖర్‌రావు కుటుంబ సభ్యులను ప్రొఫెసర్లు అభినందించారు. అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేశారు. రాజశేఖరరావు సతీమణి నాగమణి, కుమారుడు వెంకటనాంగేంద్రప్రసాద్, కుమార్తెలు విజయ లక్ష్మి, నాగజ్యోతి, బంధువులు పాల్గొన్నారు.


