కొత్తకోట రూరల్: ఎఫ్‌ఏక్యూ నిబంధనలు పాటిస్తూ యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. సోమవారం మండలంలోని కనిమెట్ట, కానాయిపల్లి, పాలెం గ్రామంతో పాటు మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో రైతులకు కల్పించిన వసతులు, ధాన్యం సేకరణ జరుపుతున్న తీరును పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సన్న, దొడ్డురకం ధాన్యాన్ని గుర్తించాలని, కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ కోసం టెంట్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, నిర్దేశిత తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి కేటాయించిన మిల్లు లేదా గోదాంకు తరలించాలన్నారు. ధాన్యం మిల్లు, గోదాంకు చేరే వరకు నిర్వాహకులదే బాధ్యతని.. కొనుగోలు పూర్తయిన వెంటనే ట్యాబ్‌ఎంట్రీ చేయాలని చెప్పారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అఽ దికారి కాశీవిశ్వనాథ్, కొత్తకోట తహసీల్దార్ చాంద్‌పాషా, పీఏసీఎస్ సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు.
సమన్వయంతో సర్వే పూర్తి చేయాలి..
వీపనగండ్ల: ఉద్యోగులు సమన్వయంతో హౌస్‌హోల్డ్ సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణకు ఆయన హాజరై సూచనలు, సలహాలు చేశారు. ప్రణాళికతో చేపడితేనే సర్వేను పూర్తి చేయగలమని.. అందుకు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు తూంకుంటలో మూతబడ్డ ఇసుక రీచ్‌ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమై ఇసుక రీచ్‌కు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ ఖాజామైనుద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ గడ్డం శివకుమార్, ఆర్‌ఐ కురుమూర్తి, సర్వేయర్ శివ తదితరులు పాల్గొన్నారు.


