● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
ఎన్.ఖీమ్యానాయక్
వనపర్తి: మొదటి విడత స్వీయ జనగణన ఆదివారం నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగనుందని.. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. ఆదివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి హరికృష్ణతో కలిసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి వివరించారు. జిల్లాలో జనగణన–2027 ప్రక్రియ చేపట్టేందుకు 1,139 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించామన్నారు. ఒక్కో బ్లాక్‌లో సుమారు 700 నుంచి 800 జనాభా ఉంటుందని.. జనగణనకు జిల్లావ్యాప్తంగా 1,086 మంది ఎన్యూమరేటర్లు, 193 మంది సూపర్‌వైజర్లను నియమించి శిక్షణనిచ్చినట్లు చెప్పారు. మొదటి విడత స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) మే 10వ తేదీ వరకు కొనసాగనుందని.. ఇప్పటికే ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నట్లు వివరించారు. ప్రజలందరూ సంబంధిత వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.


