● వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి: అహింస, ఆత్మగౌరవం, త్యాగనీరతికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దేవతామూర్తి వాసవి కన్యకాపరమేశ్వరి మాత అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్‌లో వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై వాసవీమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజానికి ధర్మం, అహింస, సత్యం వంటి గొప్ప విలువలను బోధించిన మహనీయురాలని, ఆమె చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించుకోవాలని, వాసవీమాత బోధనలు అందరూ ఆచరించాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వాసవీమాత జయంతి వేడుకలు సమాజంలో సత్ సంకల్పం పెంపొందించేలా ఉంటాయన్నారు. జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి సుధీర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
వనపర్తి రూరల్: ప్రజా ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి బోనస్ అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మెంటెపల్లి, నాచహళ్లి, పెద్దగూడెం, పెద్దగూడెం తండా, కడుకుంట్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ఽధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి ,సర్పంచ్‌లు పుష్పలత, వాల్యానాయక్, తిరుపతయ్య, రాములు, అబ్దుల్లా, పలువురు కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.


