గోపాల్‌పేట: యువత, క్రీడాభిమానులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వేసవి క్రీడా శిబిరాన్ని వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మైదానంలో రోజు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు ఫుట్‌బాల్ క్రీడలో మెళకువలు నేర్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఆంజనేయులు, జిల్లా హాకీ అకాడమీ కోచ్ సాగర్, క్రీడాకారులు సందీప్, రవి తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ వేలంవాయిదా
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో శనివారం నిర్వహించాల్సిన తైబజార్, పశువుల సంత, జంతు వధశాల బహిరంగ వేలం వాయిదా వేసినట్లు పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తైబజార్‌కు 3, పశువుల సంతకు 2, జంతు వధశాలకు దరఖాస్తులు రాకపోవడంతో వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి వేలం ఈ నెల 29 (బుధవారం) నాడు ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
శనేశ్వరుడికి
ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనిదోష నివారణ కోసం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత జిల్లేడు పూలు, తిలతైలాభిషేక పూజలు చేశారు. లింగదర్శనం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎస్‌జీఎఫ్ క్రికెట్ సంబురం
జడ్చర్ల టౌన్: పాలమూరు వేదికగా మరోసారి జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. జడ్చర్ల, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో ఆదివారం నుంచి 69వ ఎస్‌జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 31 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 28 రాష్ట్రాల జట్లు జడ్చర్లకు చేరుకున్నాయి. నేటి ఉదయం వరకు మిగిలిన మూడు జట్లు రానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లకు జడ్చర్ల బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఘన స్వాగతం పలికారు. స్వామినారాయణ గురుకుల పాఠశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. జడ్చర్ల మినీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హాజరుకాన్నారు.
31 జట్లు.. 61 మ్యాచ్‌లు..
టోర్నమెంట్‌ను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 20–20 ఓవర్ల విధానంలో 61 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 31 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఏడు గ్రూప్‌లో నాలుగేసి జట్లు ఉంటాయి. ఒక్క గ్రూప్‌లో మాత్రం మూడే జట్లు ఉంటాయి. డ్రా ద్వారా గ్రూప్‌లను విభజిస్తారు. ఆయా గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంటాయి. మ్యాచ్‌లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. మ్యాచ్‌లు జరిగే మైదానాల్లో మ్యాట్‌లు వేశారు.క్రీడాకారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మ్యాచ్‌లు తిలకించేందుకు వచ్చే వారి కోసం సైతం మైదానాల వద్ద తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు.


