● తెల్లవారుజాము నుంచేప్రారంభమైన రాకపోకలు
● విధుల్లో చేరిన 382 మంది కార్మికులు
వనపర్తిటౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా మూడు రోజులుగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించడంతో శనివారం రోడ్డెక్కాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు సమ్మె విరమణపై స్పష్టత రాకపోవడంతో కార్మికులు రిపోర్ట్ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో ఉదయం 3 గంటలకు బయలుదేరాల్సిన బస్సులు 5 గంటల సమయంలో రోడ్డెక్కాయి. సమ్మె కారణంగా మొదటిరోజు అద్దె, ఆర్టీసీ బస్సులు 20, రెండో రోజు 50, మూడోరోజు 68 బస్సులు 10 రూట్లలో ప్రైవేట్ సిబ్బందితో సేవలందించాయి. సమ్మె కారణంగా మూడు రోజుల్లో ఆర్టీసీ రూ.50 లక్షల పైచిలుకు ఆదాయం కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం 186 మంది కండక్టర్లు, 127 మంది డ్రైవర్లు, 55 మంది మెకానిక్‌లు, మరో 14 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం 382 మంది విధుల్లో చేరడంతో జిల్లావ్యాప్తంగా మొత్తం 38 రూట్లలో 109 ఆర్టీసీ, అద్దె బస్సులు రాకపోకలు సాగించాయి. డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఆయా రూట్లలో సకాలంలో బస్సులు నడిచేలా పర్యవేక్షించారు. ఆర్టీసీ సేవలను మునుపటిలాగే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.


