ఖిల్లాఘనపురం: ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్ మృతి ఎంతో బాధాకరమని టీజీయూఎస్ జిల్లా అధ్యక్షుడు రాంసింగ్‌నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో ఉన్నారని, శంకర్‌గౌడ్ మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఉద్యోగ భద్రత, వేతన సమస్యలు, పెండింగ్ బకాయిలు, పరిపాలనా ఒత్తిళ్లు తదితర సమస్యలతో ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగి శంకర్‌గౌడ్ బలిదానాన్ని ప్రభుత్వం గుర్తించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఉద్యోగులందరికి సమన్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలన్నారు. ఇకనైనా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు హీరాలాల్, ఉపాధ్యాయుడు రాజశేఖర్ పాల్గొన్నారు.
డీసీఆర్బీ డీఎస్పీని కలిసిన న్యాయ సలహాదారు
వనపర్తి: జిల్లా భరోసా కేంద్రం న్యాయ సలహాదారుగా నియమితులైన సత్యశ్రీ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలు, బాధిత వర్గాల రక్షణకు భరోసా కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు న్యాయం, మార్గదర్శకం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీసుశాఖతో సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు తక్షణ న్యాయ సాయం అందించే దిశగా నిబద్ధతతో పని చేయాలని. పోలీసుశాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,279
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,279, కనిష్టంగా రూ.5,199 ధర పలికింది. ఆముదాలు గరిష్టంగా రూ.6,279, కనిష్టంగా రూ.5,900, జొన్నలు గరిష్టంగా రూ.5,678, కనిష్టంగా రూ.4,277, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,759, కనిష్టంగా రూ.1,609, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.24,40, కనిష్టంగా రూ.1,721, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,827, కనిష్టంగా రూ.1601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,217, కనిష్టంగా రూ.1,925, హంస గరిష్టంగా రూ.1,741, కనిష్టంగా రూ.1,729గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
నారాయణపేట: తెలంగాణ ప్రభుత్వం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా హైదరాబాద్ దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో 2026–27కుగాను పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి ఎల్.రాజేందర్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండ్రలను కోల్పోయిన అనాథ బాలికలు, ఇతర నిరాశ్రయ బాలికలు (అక్రమ రవాణాకు గురైన బాధిత బాలికలు) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. మొత్తం సీట్లలో 70 శాతం వీరికే కేటాయిస్తామని.. పదో తరగతి పాసైన వారు అర్హులన్నారు. ఎంపికై న బాలికలకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం (అనాథలైతే..) , హాస్టల్/హోమ్ నుంచి సంబంధిత సూపరింటెండెంట్/అధికారితో జారీ చేసిన డిక్లరేషన్/బోనాఫైడ్ సర్టిఫికేట్ బదిలీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికేట్, మెమో (కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలి) జిరాక్స్ ప్రతులను దరఖాస్తునకు జతచేసి మే నెల 22లోగా జిల్లాకేంద్రంలోని బాలరక్ష భవన్, మోనప్పగుట్ట, కలెక్టర్ కార్యాలయం పక్కన సమర్పించాలని, ఇతర వివరాలకు జిల్లా బాలల పరిరక్షణ అధికారిని సంప్రదించవచ్చని సూచించారు.


