ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి

Apr 25 2026 7:18 AM | Updated on Apr 25 2026 7:18 AM

వనపర్తిటౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను శుక్రవారం ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి, ఆస్తుల పరిరక్షణకు నాటి కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేసిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి చట్టాన్ని రూపొందించి నాటి గవర్నర్‌ అనుమతికి పంపితే కాలయాపనతో సాధ్యం కాలేదని వివరించారు. వేతన సవరణ 44 శాతం అందించింది కేసీఆర్‌ అని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి పోరాడటం ప్రాథమిక హక్కని.. నేటి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణగదొక్కడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికులు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పారు.

ప్రభుత్వం కాలయాపన చేస్తూ కార్మికులను పట్టించుకోకుంటే ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు అండగా ఉంటూ పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ విశ్వనాథం, బొబ్బిలి ప్రేమ్‌కుమార్‌, పెద్దముక్కుల రవి, చలపతిరెడ్డి, బీఎస్‌ నారాయణ, గోకం భాస్కర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు గట్టుయాదవ్‌, వాకిటి శ్రీధర్‌, నందిమళ్ల అశోక్‌, శ్రీకర్‌గౌడ్‌, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, సూర్యవంశం గిరి, జోహెబ్‌ హుస్సేన్‌, హేమంత్‌, చిట్యాల రాము, మంద రాము, అస్లాం తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ..

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కార్మికులు ఆర్టీసీ డిపో నుంచి బస్టాండ్‌, పొట్టి శ్రీరాములు చౌరస్తా, రాజీవ్‌ చౌక్‌, కమాన్‌ చౌరస్తా, శంకర్‌గంజ్‌ తదితర ప్రాంతాల మీదుగా మౌన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement