● రెవెన్యూ అదనపు
కలెక్టర్ వినోద్‌కుమార్
ఖిల్లాఘనపురం: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 11 నుంచి కొనసాగుతున్న ఇళ్ల గణన పక్కాగా చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు కొనసాగుతున్న శిక్షణను శుక్రవారం ఆయన పరిశీలించారు. వారితో మాట్లాడి శిక్షణలో ఎదురవుతున్న సమస్యలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనగణనలో భాగంగా ముందుగా చేపట్టే ఇళ్ల గణన సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. రోజు ఉదయం వేళలో సర్వే చేసేలా చూసుకోవాలని.. ఆ సమయంలో ఎండవేడిమి తక్కువగా ఉండటంతో పాటు ప్రజలంతా ఇళ్ల దగ్గరే ఉంటారని చెప్పారు. సర్వే పూర్తయిన ఇళ్లకు కచ్చితంగా స్టిక్కర్ అంటించాలని.. ప్రతి ఒక్కరి ఇంటి పేరుతో పేర్లు రాయాలన్నారు. ఇళ్ల రకాలు, ఆలయాలు, పాఠశాలలు తదితర ప్రభుత్వ భవనాలను గుర్తించాలని.. కార్లు, మోటర్ సైకిళ్లు, టీవీలు తదితర వాటి వివరాలు చెప్పేందుకు ఇష్టపడని వారితో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేర్పుతో ఒప్పించి సేకరించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వరి కోతలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సాదాబైనామాల పరిష్కారం, మండలంలోని భూముల పరిస్థితులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర వాటి వివరాలను తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 382 వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని.. ఇప్పటి వరకు 103 గ్రామాల్లో ప్రారంభించినట్లు చెప్పారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులు, జనాలతో మాట్లాడి ఎందుకోసం వచ్చారు.. కార్యాలయ అధికారులు పనులు ఎలా చేస్తున్నారు అనే విషయాలను ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్, ఆర్‌ఐ తిరుపతయ్య, కార్యాలయ సిబ్బంది, టీఓటీలు, ఎన్యూమరేటర్లు ఉన్నారు.


