ఖిల్లాఘనపురం: ఉపాధి పనుల్లో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో నీటి కుంటలు తవ్వడంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు మూగ జీవాలకు తాగునీటి వసతి ఏర్పడుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అమృత్ సరోవర్‌లో భాగంగా శుక్రవారం మండలంలోని ఉప్పరిపల్లి శివారులో నెమలి జాలు వంపు వద్ద తవ్విన నీటి కుంటను వారు పరిశీలించి కూలీలతో మాట్లాడారు. 10 వారాలుగా కూలీ డబ్బులు రావడం లేదని తెలుపగా.. వివరాలు తెలుసుకొని వారం రోజుల్లో చెల్లించేలా చూస్తామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులో రూ.10 లక్షల ఉపాధి నిధులతో అమృత్ సరోవర్ ఫండ్‌ను తవ్వుతున్నట్లు చెప్పారు. జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఇలాంటి వాటిని నిర్మించడంతో భూగర్భ జలాలు కచ్చితంగా పెరుగుతాయన్నారు. అటవీ భూమి కావడంతో మూగ జీవాలకు కూడా తాగునీటి వసతి కల్పించినవారమవుతామని తెలిపారు. గ్రామానికి చాలా దూరంలో పనులు చేస్తున్నామని.. రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కూలీలు చెప్పడంతో స్పందించిన అధికారులు మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువగా ఉన్నందున గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో కూలీలను తీసుకెళ్లాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీత, ఎంపీఓ నర్సింహులు, ఏపీఓ లక్ష్మి, ఈసీ సత్యం, టీఏ, ఎఫ్‌ఏ తదితరులు పాల్గొన్నారు.


