వనపర్తి: ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు పలు డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజు కొనసాగింది. జిల్లాకేంద్రమైన వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రైవేటు డ్రైవర్లతో ఉదయం అంతంతమాత్రంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు.. సాయంత్రం వరకు 50 శాతానికి పైగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని బస్సులను ప్రైవేటు కండెక్టర్లతో నడపగా.. మరికొన్నింటిని కండెక్టర్ లేకుండానే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. గురువారం పాఠశాలలకు చివరిరోజు కావడంతో గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్ల నుంచి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు దాదాపుగా తమ సొంత వాహనాలనే వినియోగించారు.
పోలీసు పహారాలో..
తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో, బస్టాండ్ వద్ద పోలీసులు మోహరించారు. కార్మికుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు పహారా మధ్య బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని బస్సుల్లో పోలీసు సిబ్బంది కండక్టర్లుగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్, కర్నూలు, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, ఆత్మకూర్, ఖిల్లాఘనపురం తదితర రూట్లలో బస్సుల సమయపాలన లేకపోయినా.. ఆశించిన మేర అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 71 బస్సులు ప్రయాణికులకు సేవలందించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. 17 ఆర్టీసీ బస్సులు, 47 అద్దె బస్సులు, 7 ఈవీ బస్సులను నడిపినట్లు పేర్కొన్నారు.
రెండో రోజు అరకొరగానే
బస్సు సర్వీసులు
కార్మికుల సమ్మెకు అద్దె బస్సుల
యజమానుల మద్దతు
50శాతం పైగా బస్సులు నడిపినట్లు అధికారుల వెల్లడి
రీజియన్‌లో 426 నడిచిన బస్సులు
రెండు రోజు గురువారం మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు 925 బస్సులకుగాను 426 బస్సులు మాత్రమే నడిచాయి. 57 ఆర్టీసీ బస్సులు, 346 ప్రైవేట్ హైర్ బస్సులు, 23 ఈవీ బస్సులు నడిచాయి.


