మదనాపురం: ఓటరు జాబితాను తప్పులు లేకుండా పాదర్శకంగా రూపొందించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. గురువారం మదనాపురం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. జాబితాలో మరణించిన వారి పేర్లను గుర్తించి తొలగించాలని.. దీనిపై క్షేత్రస్థాయిలో పక్కాగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరినీ ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరు కూడా ఓటు హక్కుకు దూ రం కాకూడదన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆ యన హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దా ర్ రేపోలు రాజు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
‘ఉపాధి’ కూలీల
వేతనాలు చెల్లించండి
అమరచింత: ఉపాధిహామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అమరచింత ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మూడు నెలలుగా కూలి చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయడంతో పాటు రోజు పని ప్రదేశంలో రెండు పూటల ఫొటో క్యాప్చర్ తీసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. వడదెబ్బతో చనిపోయిన ఉపాధి కూలీలకు రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో తాగునీటి వసతి, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు తట్టబుట్ట సరఫరా చేయాలన్నారు. కొలతల పద్ధతిని రద్దుచేసి, రోజు కూలి రూ.600 ఇవ్వాలని.. ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో భగవంతు, చిన్నవిష్ణు, జలగరి రాములు, విజయ్, నిశాంత్, అరుణ్ పాల్గొన్నారు.
కోఆప్షన్ సభ్యుల
ఎన్నిక వాయిదా
ఆత్మకూర్: స్థానిక మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికను వాయిదా వేసినట్లు చికినే శశిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పాలనలో అనుభవమున్న మాజీ వార్డు సభ్యుల నుంచి ఒక్క నామినేషన్ కూడా అందకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని వివరించారు. తిరిగి 24, 25 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, 27న ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయాలని.. ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని కమిషనర్ సూచించారు.
వేరుశనగ @ రూ.6,461
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.6,461, కనిష్టంగా రూ.4,889 ధరలు లభిచాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,310, కనిష్టంగా రూ.5,940, జొన్నలు గరిష్టంగా రూ.5,887, కనిష్టంగా రూ.5,377, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,609, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,461, కనిష్టంగా రూ.1,651, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,831, కనిష్టంగా రూ.1,600, కందులు రూ.గరిష్టంగా రూ.6,266, కనిష్టంగా రూ.5,660, పెబ్బర్లు రూ.6,277 ధరలు లభించాయి.


