ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను శోభాయమానంగా అలంకరించి.. వేదమంత్రాల నడుమ కల్యాణతంతు జరిపించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కార్యక్రమాన్ని కనులారా తిలకించారు.


