రీజియన్‌లో 134 నడిచిన బస్సులు | - | Sakshi
Sakshi News home page

రీజియన్‌లో 134 నడిచిన బస్సులు

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

రీజియన్‌లో 134 నడిచిన బస్సులు

109 బస్సులకు గాను

సేవలందించింది 20 మాత్రమే

ప్రయాణికులకు తప్పని తిప్పలు

డిపో ఎదుట నిరసన తెలిపిన

ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు

వనపర్తి టౌన్‌: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మెతో బుధవారం ప్రగతి రథ చక్రాలు డిపోకే పరిమితమయ్యాయి. వనపర్తి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు ప్రజలకు ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ వాహనాల వైపు పరుగులు తీశారు. మూడు, నాలుగు గంటలకు ఒక్క బస్సు రావడం.. అది కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బస్సులే కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్మికుల సమ్మెను విజయవంతం చేసేందుకు వనపర్తి ఆర్టీసీ జేఏసీ కార్మికులు వేకువజాము నుంచే డిపో ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిపోల నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా ముట్టడించారు.

పోలీస్‌, రవాణా అధికారుల సహకారంతో..

పోలీస్‌, రవాణా శాఖ అధికారుల సహకారంతో కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు అతికష్టం మీద నడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రవాణా శాఖ అధికారులు హెవీ లైసెన్స్‌ ఉన్న 12 మంది డ్రైవర్లను, మరో ఏజెన్సీ 12 మంది కండక్టర్లను తీసుకొని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఆత్మకూర్‌, గద్వాల తదితర ప్రాంతాలకు మొత్తంగా కేవలం 12 బస్సులను మాత్రమే నడపగలిగారు. ఆర్టీసీ అధికారులు విన్నవించినా.. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు అత్యధికులు సమ్మెకు మద్దతివ్వడంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. కేవలం 8 అద్దె బస్సులు మాత్రమే రాకపోకలు సాగించాయి. ప్రతీ రోజు ఆర్టీసీ డిపో నుంచి డిపార్ట్‌మెంట్‌, అద్దె బస్సులు కలుపుకొని 38 రూట్లలో 109 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేవి. సమ్మె కారణంగా రెండు, మూడు రూట్లలో ఒకే సర్వీస్‌తో అద్దె, ఆర్టీసీ బస్సులు కలుపుకొని కేవలం 20 బస్సులను మాత్రమే డిపో అధికారులు నడపగలిగారు. ఉమ్మడి జిల్లాలో ఏ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు రోడెక్కడం లేదని, వనపర్తి డిపో మేనేజర్‌ కార్మికుల సమ్మెకు సహకరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ నాయకులు డీఎం దేవేందర్‌గౌడ్‌తో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను వ్యవహరిస్తున్నట్లు డీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులకు, డిపో మేనేజర్‌ దేవేందర్‌గౌడ్‌తో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్‌ హైర్‌, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్‌నగర్‌ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement