కందనూలు: భూమిని సంరక్షించడం అందరి బాధ్యత అని, విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పర్యావరణాన్ని రక్షించడం అంటే మన భవిష్యత్‌ను రక్షించుకోవడమే’ అనే నినాదంతో విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేపట్టి ప్రజల్లో చైతన్యం కల్పించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సులోనే పర్యావరణ విలువలను అలవర్చుకోవాలని, వాటిని సమాజంలోకి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. భూమి తల్లి సంరక్షణ కోసం చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి వనరుల సంరక్షణ వంటి చర్యలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు తమ పంట పొలాల్లో వినియోగించే ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని గుర్తు చేయాలని, ఎరువుల వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని చెప్పారు. అనంతరం పుడమితల్లి సంరక్షణపై వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ కుర్మయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్‌రావు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి కిరణ్‌కుమార్, ఉపాధ్యాయుడు సుదర్శన్, విద్యార్థులు పాల్గొన్నారు.


