ఇష్టారాజ్యం! | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యం!

Apr 19 2026 8:29 AM | Updated on Apr 19 2026 8:29 AM

ట్రిప్పునకు రూ.500 డిమాండ్‌ చేస్తున్న వైనం

పట్టించుకోని అధికారులు.. తనకేమీ సంబంధం లేదంటున్న ఎస్‌ఆర్‌ఓ

ఖిల్లాఘనపురం: మండలంలోని అంతాయపల్లి శివారులో ఉన్న రీచ్‌ నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను వివిధ ప్రాంతాలకు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి తరలిస్తుంటారు. ఈ ఇసుక తరలింపునకు గతంలో కొందరు ట్రాక్టర్ల యజమానులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వేసవి కావడంతో చాలామంది ఇళ్లు, ప్రహరీల నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకుంటున్నారు. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5 వరకు ఇసుక తరలింపునకు ప్రభుత్వం రీచ్‌లో ఓ అఽధికారిని నియమించింది. ఆయన నిత్యం వరుస క్రమంలో ఇసుక బుక్‌ చేసుకున్న వారికి పంపిస్తున్నారు.

కిలోమీటర్ల

ఆధారంగా ధర..

అంతాయపల్లి రీచ్‌ నుంచి మండలంతో పాటు పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలకు ఇసుక తరలింపునకుగాను ప్రభుత్వం కిలోమీటర్ల ఆధారంగా ధర నిర్ణయించింది. ఇసుక అవసరం ఉన్న వారు మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి బుక్‌ చేసుకోవాలి. అలా బుక్‌ చేసుకున్న వారికి వరుస క్రమంలో ఇళ్ల దగ్గరకు ఇసుక వస్తోంది.

డబ్బులు డిమాండ్‌..

కేవలం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ట్రాక్టర్ల నిర్వాహకులు మాత్రమే రీచ్‌ నుంచి ఇసుక తరలింపునకు అవకాశం ఉంది. తమను కాదని ఎవరి ట్రాక్లర్లు వస్తాయిలే అనుకున్న యజమానులు ఇష్టానుసారంగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం రీచ్‌ నుంచి అప్పారెడ్డిపల్లికి ఇసుకతో వచ్చిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున రూ.వెయ్యి అదనంగా ఇవ్వాలని పట్టుబట్టారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించామని.. తిరిగి ఎందుకివ్వాలని అడగడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. డబ్బులు ఇవ్వనందుకు ఓ ట్రాక్టర్‌ యజమాని 25 శాతం ఇసుకను తిరిగి తీసుకెళ్లారు. ఇంత జరుగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ్‌లో ఉండే ఎస్‌ఆర్‌ఓ తనకేమీ తెలియదని.. ట్రాక్టర్ల వారికి అద్దె పడితే వస్తారు లేదంటే రారుంటూ జవాబిచ్చారు. ఎప్పట్నుంచో ఇస్తున్నారంట కదా... ఇప్పుడిస్తే ఏమైతుందని మాట్లాడటం విస్మయానికి గురిచేస్తోంది. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement