వనపర్తి: ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు శిక్షణను సద్వినియోగం చేసుకొని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని మర్రికుంట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణకు ఆయన హాజరై పలు సూచనలు చేశారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లే ముందు తమకు ఇచ్చిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాప్ ఆధారంగా హద్దులను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎవరి పరిధిలో వారే జనగణన చేపట్టాలని, కిచెన్ ఆధారంగా హౌస్‌హోల్డ్‌ని నిర్ణయించాలని సూచించారు. ప్రజలు సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తే, వారి వ్యక్తిగత సమాచారం ఎక్కడా వినియోగించడం జరగదని.. కేవలం జనగణన కోసం తీసుకుంటున్నట్లు వారికి తెలియజేయాలన్నారు. డబుల్ ఎన్యూమరేషన్ ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని హెచ్చరించారు. సీపీఓ హరికృష్ణ, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, శిక్షకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ వారోత్సవాలు విజయవంతం చేయాలి
ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్లు వినోద్‌కుమార్, ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సంక్షేమ వారోత్సవాలను పక్కాగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి రోజు ఏప్రిల్ 20న అన్ని సంక్షేమ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో శానిటేషన్ డ్రైవ్, రెండోరోజు విద్యార్థులకు టాలెంట్ ఫెస్టివల్ పేరుతో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని సూచించారు. మూడోరోజు సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థల్లో మరమ్మతులు చేపట్టాలని, నాలుగో రోజున విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సౌకర్యాలను వివరించాలన్నారు. తదుపరి రోజుల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జిల్లా అధికారులు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఇతర సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.


