పక్కాగా వివరాల నమోదు | - | Sakshi
Sakshi News home page

పక్కాగా వివరాల నమోదు

Apr 19 2026 8:29 AM | Updated on Apr 19 2026 8:29 AM

కొత్తకోట రూరల్‌: జనగణన ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి చేరుకొని వివరాలను పక్కాగా డిజిటల్‌ యాప్‌లో నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. శనివారం పెద్దమందడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎన్యూమరేటర్ల శిక్షణను సందర్శించి మాట్లాడారు. 2027 జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. అనంతరం గోపాలపేట మండలం బుద్ధారం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి పనులను డీఆర్డీఓ, డీపీఓతో కలిసి పరిశీలించారు. గ్రామంలోని సీఎస్‌సీ కేంద్రం, గ్రామపంచాయతీ నర్సరీలు, కోళ్ల షెడ్‌ను సందర్శించి నిర్వహణ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బుద్ధారం గ్రామపంచాయతీలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు నమోదును పరిశీలించారు. కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలని, ప్రజలకు లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా అదనపు ఎస్పీగా రాజేష్‌ మీనా

వనపర్తి: జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా రాజేష్‌ మీనాను నియమిస్తూ శనివారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఈ పోస్టు కొంతకాలంగా జిల్లాలో ఖాళీగా ఉంది. ఈయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి.

రైస్‌మిల్‌పై కేసునమోదు

ఖిల్లాఘనపురం: మండల పరిధిలోని సోళీపురం గ్రామంలో ఉన్న ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లుపై శనివారం కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగమైనట్లు పౌరసరఫరాల కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ ఎన్‌.ఆంజనేయులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 2022–23 వానాకాలం, 2022–23 యాసంగి, 2023–24 వానాకాలం సీజన్లలో ప్రభుత్వం నుంచి వరి ధాన్యం కేటాయించగా.. ఇందుకు సంబంధించిన సీఎంఆర్‌ అప్పగించలేదని పేర్కొన్నారు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గణనీయమైన ధాన్యం లోటు కనిపించిందని.. ప్రభుత్వ ధాన్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు మళ్లించినట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement