వనపర్తి రూరల్: రహదారి భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ప్రాణం అమూల్యమైందని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని రాజపేట శివారు పోలీస్ పెట్రోల్‌బంక్ ఆవరణలో గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి వారితో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు నియమాల ప్రాముఖ్యతను వివరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి చిన్న జాగ్రతలు మన ప్రాణాలను రక్షించే పెద్ద ఆయుధాలని, ప్రతి ఒక్కరూ తన బాధ్యతను గుర్తించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రతగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ హృషికేష్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


