
పాఠ్యాంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి
వనపర్తి రూరల్: విద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకోవాలని, అర్థం కాకపోతే వెంటనే ఉపాధ్యాయులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్‌సురభి సూచించారు. సోమవారం మండలంలోని కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. కడుకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి గదిలో ఉపాధ్యాయుడు గణిత పాఠ్యాంశాలను బోధిస్తుండగా అక్కడే కూర్చొని పర్యవేక్షించారు. కలెక్టర్ విద్యార్థులకు గణితం బోధించడంతో పాటు ప్రశ్నలను సంధించి వారి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రసవాల సంఖ్యను పెంచాలని వైద్యాధికారులకు సూచించారు. డెలివరీ, ఓపీ రిజిస్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. పెద్దగూడెంలో తిరుమల ఎరువుల దుకాణాన్ని, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎరువుల నిల్వను పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద యూరియా, ఇతర ఎరువుల నిల్వకు సంబంధించిన బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఎరువుల కృతిమ కొరత సృష్టించొద్దని ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.