భూ సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలు పరిష్కరిస్తాం

Jul 28 2025 12:18 PM | Updated on Jul 28 2025 12:18 PM

భూ సమ

భూ సమస్యలు పరిష్కరిస్తాం

రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పూర్తిచేస్తాం

వనపర్తి: రైతులు తమ భూ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేలా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించిందని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆగష్టు 15లోగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. భూ భారతి చట్టం అమలు, జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ ఫిర్యాదుల పరిష్కారంపై రెవెన్యూ అదనపు కలెక్టర్‌తో ‘సాక్షి’ చర్చించగా పలు విషయాలు వెల్లడించారు.

ప్రశ్న: ధరణితో పోలిస్తే భూ భారతి చట్టం రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తోంది.

అదనపు కలెక్టర్‌: ధరణిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేది కాదు. నేరుగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో రైతులు ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. భూ భారతి చట్టంతో ఆర్డీఓ, కలెక్టర్‌ స్థాయిలో మునుపటిలా కోర్టులు నిర్వహించే అవకాశం ఉంది.

ప్రశ్న: భూ భారతి చట్టంపై కొందరు తహసీల్దార్లు పూర్తిస్థాయిలో అవగాహన పొందలేదనే ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితి ఏమిటి?

అదనపు కలెక్టర్‌: భూ భారతి చట్టంపై ఇప్పటికే పలుమార్లు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. కొందరితో సమస్యలు ఉన్నాయి. మెల్లిగా దారిలోకి వస్తున్నారు. ఎప్పటికప్పుడు వారికి సలహాలు, సూచనలిస్తూ దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

ప్రశ్న: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ప్రస్తుతం వాటి పురోగతి ఎలా ఉంది?

అదనపు కలెక్టర్‌: జూన్‌ మొదటి వారంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో జిల్లావ్యాప్తంగా 7,648 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5 వేల పైచిలుకు దరఖాస్తుల పరిష్కారానికి నోటీసులు జారీ, అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ పూర్తిచేశాం. సుమారు 920 దరఖాస్తుల పరిష్కారానికి అధికారిక ఆమోదం ఇచ్చాం. ఇప్పటి వరకు కేవలం 101 దరఖాస్తులు మాత్రమే తిరస్కరించాం.

ప్రశ్న: ప్రభుత్వ భూమిని ఏళ్లుగా సాగు చేస్తూ రికార్డులేని వారికి హక్కులు కల్పిస్తారా?

అదనపు కలెక్టర్‌: ఈ అంశంపై జిల్లాలో కొన్ని దరఖాస్తులు వచ్చాయి. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న పేదలకు హక్కు కల్పిస్తాం. అసైన్డ్‌ కమిటీల నియామకం తర్వాత వారికి కమిటీ సిఫారస్‌ మేరకు రికార్డు ప్రకారం హక్కు కల్పిస్తాం.

ప్రశ్న: అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ, శిఖం భూములు కాపాడేందుకు చట్టంలో ఎలాంటి వెసులుబాటు ఉంది?

అదనపు కలెక్టర్‌: ప్రభుత్వ భూమి, చెరువులు, కుంటలు కబ్జా చేసినట్లు అధికారుల దృష్టికి వస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. ఇటీవల ఏదుల శివారులో 20 ఎకరాలు, పెబ్బేరులో శిఖం భూమి రెండు ఎకరాలు కబ్జా నుంచి విడిపించాం. ఇలాంటి ఘటనలు ఏమైనా ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకురావాలి.

ప్రశ్న: రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం ఆగస్టు 15లోగా వందశాతం పరిష్కారం సాధ్యమేనా?

అదనపు కలెక్టర్‌: రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారంలో ప్రస్తుతం రాష్ట్రంలోనే జిల్లా టాప్‌ టెన్‌లో ఉంది. సాధ్యమైనంత వరకు పూర్తి చేస్తాం. సిబ్బంది సహకరిస్తే మరింత పురోగతి పెంచుతాం.

ప్రశ్న: అసైన్డ్‌ పట్టా పొందిన భూమిని వ్యక్తిగత అవసరాలకు విక్రయించుకుంటే కొన్నవారికి హక్కులు వర్తిస్తాయా? రికార్డులో పేరు మార్చే అవకాశం ఉందా?

అదనపు కలెక్టర్‌: కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిలో కాస్తులో ఉంటూ.. పేద కుటుంబానికి చెందిన వారై ఉండాలి. అప్పుడు అసైన్డ్‌ కమిటీ సిఫారస్‌ మేరకు రికార్డులో కొత్తవారి పేరు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

కోర్టు కేసులు, సాదా బైనామాల అమలుకు

కోర్టు అనుమతి తప్పనిసరి

‘భూ భారతిపై తహసీల్దార్లు,

రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించాం

‘సాక్షి’తో రెవెన్యూ అదనపు కలెక్టర్‌

జి.వెంకటేశ్వర్లు

ప్రశ్న: ఎన్నిరకాల భూ సమస్యలపై దరఖాస్తులు అందాయి?

అదనపు కలెక్టర్‌: సక్సెషన్‌, మ్యుటేషన్‌, డీఎస్‌ పెండింగ్‌, మిస్సింగ్‌ సర్వేనంబర్లు, మిస్సింగ్‌ ల్యాండ్‌, సాదాబైనామా అమలు, అసైన్డ్‌ ల్యాండ్‌, అసైన్డ్‌ ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తులు వచ్చాయి. కోర్టు పరిధిలో ఉన్న వాటిని పెండింగ్‌లో ఉంచి మిగతా దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభించాం.

భూ సమస్యలు పరిష్కరిస్తాం1
1/1

భూ సమస్యలు పరిష్కరిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement