ఆత్మనిర్భర్ భారత్‌లో మరో ముందడుగు
అమరచింత: కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా చిన్న మొత్తంలో రుణాలు ఇప్పించి ఆదుకుంది. రూ. పది వేల నుంచి మొదలైన రుణం.. ప్రస్తుతం రూ.20 వేలు, రూ.50 వేల రూపాయల వరకు బ్యాంకులు ఇస్తుండటంతో తమ వ్యాపారాలను పెంపొందించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 6,463 మంది వీధి విక్రయదారులు బ్యాంకుల్లో రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటూ క్రమం తప్పకుండా నెలనెలా కిస్తులు చెల్లిస్తూ తిరిగి రుణాలు పొందుతున్నారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో కేంద్రం వీధి విక్రయదారులకు మరో అవకాశం కల్పిస్తూ సంఘాలు ఏర్పాటుచేసి ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా మెప్మా అధికారులు పురపాలికల్లో వీధి విక్రయదారులను కలిసి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి సంఘంలో 5 నుంచి 10 మంది సభ్యులు ఉండేందుకు అవకాశం కల్పించడంతో వీధి విక్రయదారుల సంఘాల ఆవిర్భావానికి అంకురార్పణ జరిగినట్లయింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 50కి పైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్లు మెప్మా అధికారులు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు..
ప్రస్తుతం కొనసాగుతున్న మహిళా సంఘాల మాదిరిగానే వీధి విక్రయదారులను జత చేస్తూ సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సంఘాల్లో 10 నుంచి 15 మంది సభ్యులు ఉండటం తెలిసిందే. ఇదే తరహలో వీధి విక్రయదారులు తమకు అనుకూలంగా ఉండే వారితో జత కలిసి సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి సంఘంలో కనీసం 5 మంది సభ్యులు ఉండాలనే నియమం ఉంది. మహిళా సంఘాల్లో సభ్యులు ఒక్కొక్కరు ప్రతి నెల రూ.100 నుంచి రూ.200 పొదుపు చేస్తున్నట్లుగానే వీరుకూడా ప్రతినెల కొంత మొత్తం జమ చేయాలని మెప్మా అధికారులు సూచిస్తున్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాల మాదిరిగానే వీరికి కూడా భవిష్యత్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు.
పురపాలికల్లో కొత్తగా ఏర్పాటు
ఐదు మున్సిపాల్టీలు..
6,463 మంది వీధి విక్రయదారులు
మహిళా పొదుపు సంఘాల తరహాలో..
అవగాహన కల్పిస్తున్న అధికారులు
ఎక్కువ రుణాలు పొందే అవకాశం..
వీది విక్రయదారులతో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిపించడంతో అనుకున్న రుణం కన్నా ఎక్కువ మొత్తం ఇప్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాల మాదిరిగా భవిష్యత్‌లో వీరి పొదుపును దృష్టిలో ఉంచుకొని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. వీధి విక్రయదారులకు అవగాహన కల్పిస్తూ సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. – బాలరాజు, జిల్లా కో–ఆర్డినేటర్, మెప్మా
వీధి వ్యాపారుల సంఘాలు