
మానవ అక్రమ రవాణా నేరం
వనపర్తి: అన్ని ప్రభుత్వ శాఖల సమష్టి కృషితోనే మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించవచ్చని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జూలై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో యాక్సెస్ టు జస్టిస్‌లో భాగంగా జిల్లా రూరల్ డెవలప్‌మెంట్ స్వచ్ఛంద సంస్థ మరియు మహిళ, శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా సఖి, భరోసా, ఆపరేషన్ ముస్కాన్, షీటీం, లీగల్ సర్వీసెస్, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, జిల్లా వైద్యాధికారి, జస్టిస్ జోనల్ బోర్డ్ తదితర శాఖలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మానవ అక్రమ రవాణాకు సంబంధించి చట్టపరమైన నిబంధనలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, దర్యాప్తు విధానం, న్యాయపరమైన సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో చదువు మానేసిన మహేష్ చెత్త కాగితాలు ఏరుకుంటున్న మహేష్‌ను 2022లో ఆర్డీఎస్ సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ చేరదీసి పాఠశాలలో చేర్పించారు. 2025లో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 480 మార్కులు సాధించి ఆదర్శంగా నిలవడంతో మహేష్‌ను ఎస్పీ శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించారు. భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం సాధించి పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అనే స్వచ్ఛంద సంస్థ పని చేస్తుందని తెలిపారు. ఇలాంటి కేసులు మొదటగా గుర్తించేది పోలీస్‌శాఖ కాబట్టి వీటిపైన పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే జిల్లా పరిధిలో మానవ అక్రమ రవాణా జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చట్టాలు ఉన్నాయని.. నేరస్తులను శిక్షించవచ్చని తెలిపారు. రోజు గ్రామాల్లో సందర్శిస్తూ మానవ అక్రమ రవాణా, బాల కార్మికులను గుర్తించే చర్యలు కొనసాగాలన్నారు. మానవ అక్రమ రవాణా జరిగితే ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్ 181, చైల్డ్‌లైన్ 1098, డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చెన్నమ్మ థామస్, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ అంజద్, ఆపరేషన్ ముస్కాన్ ఎస్‌ఐ రాము, జస్టిస్ జువనైల్ బోర్డు సభ్యురాలు గిరిజ, మానసిక వైద్యురాలు పుష్పలత, సఖి కో–ఆర్డినేటర్ కవిత, భరోసా కో–ఆర్డినేటర్ శిరీష, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాంబాబు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు వనజ, విజయ్, భరోసా, సఖి, ఆపరేషన్ ముస్కాన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే బాలలకు బంగారు భవిష్యత్
ఎస్పీ రావుల గిరిధర్