
గురుకులాల పటిష్టతకు ప్రభుత్వం కృషి
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని గురుకులాల పటిష్టతకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మండలంలోని చిట్యాల శివారు ఎంజేపీ గురుకుల పాఠశాల పీఎంశ్రీ నిర్వహణలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. పీఎంశ్రీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 5వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంగళవారం జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీఎంశ్రీ బెస్ట్ పాఠశాలగా చిట్యాల ఎంజేపీ గురుకులం ఎంపిక కావడానికి కృషి చేసిన పాఠశాల అధ్యాపక బృందాన్ని అభినందించారు. విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలను తమ ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. పాఠశాల సముదాయంలో ఇంటర్ కళాశాల భవన నిర్మాణం చేపట్టాలని, సీసీ రోడ్డు, ఓవర్‌హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు ప్రిన్సిపాల్ గురువయ్యగౌడ్ వినతిపత్రం అందజేశారు. ఓవర్‌హెడ్ ట్యాంక్, సీసీ రహదారుల నిర్మాణాలకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్ గురుకుల కళాశాల భవన నిర్మాణానికి రూ.10 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని.. తమ ప్రభుత్వ హయంలో పూర్తిస్థాయిలో పటిష్టపరుస్తునట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు శంకర్‌నాయక్, రవి, రఘుపతిరావు, రాంరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.