
ఆదాయ మార్గాలపై దృష్టి సారించండి
అమరచింత: పురపాలికకు ఆదాయం సమకూర్చే ఆస్తి, వాణిజ్య, కొళాయి పన్నులను క్రమం తప్పకుండా వసూలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు ఆదేశించారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా పురపాలికలోని 4వ వార్డులో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పరిసరాల శుభ్రత, తాగునీటి సరఫరాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పుర కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం పుర సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆగస్టు చివరి నాటికి 40 శాతం పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కొళాయి పన్నును సైతం క్రమం తప్పకుండా వసూలు చేయాలని.. వీటితోనే పుర అభివృద్ధితో పాటు కార్మికుల వేతనాలు చెల్లించే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. పారిశుద్ధ్య పనులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు దోమల నివారణ మందు పిచికారీ చేయాలని సూచించారు. ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్లు నిత్యం వెలిగేలా చూడాలని, మెప్మా సిబ్బంది పట్టణ మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడంతో పాటు సకాలంలో తిరిగి చెల్లించేలా ప్రతినెల సమావేశాలు నిర్వహించాలన్నారు. కొత్త సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో పుర కమిషనర్ నాగరాజు, మేనేజర్ యూసుఫ్, మెప్మా జిల్లా కో–ఆర్టినేటర్ బాలరాజు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.