
ఎరువుల విక్రయాలపై నజర్
మదనాపురం: ఎరువుల విక్రయాలపై నెలకొన్న సందిగ్ధతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎరువుల కొరత తలెత్తకుండా సరఫరా చేసేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. కలెక్టర్ సారథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారులు సరఫరా, విక్రయాల ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఎరువుల విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అంతేగాకుండా ప్రతి విక్రయ కేంద్రంలో నోటీసు బోర్డులు ఏర్పాటుచేసి వాటిపై ఎరువుల ధరలతో పాటు నిల్వల వివరాలు పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు.
యూరియా కొరత లేదు..
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది వానాకాలంలో 19 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించగా.. ఈసారి జిల్లాకు 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని ప్రతిపాదనలు అధికారులు పంపించారు. గతేడాది మాదిరిగా 19 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా.. 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని, మిగతాది త్వరలో రానుందని చెబుతున్నారు.
పక్కదారి పట్టకుండా ప్రత్యేక నిఘా
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
జిల్లాకు 19 మెట్రిక్ టన్నుల
యూరియా కేటాయింపు
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..
జిల్లాలో ఎరువులు, యూరియా కొరత లేదు. వానాకాలం సీజన్‌కుగాను 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా.. ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చింది. దుకాణదారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తాం. రైతులు మూస పద్ధతిలో ఎరువులను అధికంగా వాడకుండా మండల వ్యవసాయ అఽధికారుల సూచనలు పాటించాలి.
– ఆంజనేయులుగౌడ్,
జిల్లా వ్యవసాయ అధికారి
నిరంతర పర్యవేక్షణ..
వారం రోజులుగా జిల్లాలోని ఎరువుల దుకాణాలను జిల్లా, మండల అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. దుకాణదారులు వచ్చిన ఎరువులను అధిక ధరలకు విక్రయించకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ధరలు, నిల్వల పట్టిక దుకాణంలో రైతులకు కనబడేలా విధిగా ఏర్పాటు చేయాలని వత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన మందులను వాడవద్దని, అధికారుల సలహాలు లేకుండా పొలాల్లో మందులు వేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా కొత్తకోట, మదనాపురం, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూర్, వీపనగండ్ల, శ్రీరంగాపురం, ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాల్లో వరి అధికంగా సాగు చేస్తారు.