
తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన
వనపర్తి రూరల్: తల్లిపాల ప్రయోజనాలపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఈ నెల 7 వరకు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో పర్యటించారు. మొదట పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడివెల్‌నెస్ సెంటర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిపాలు తాగిన బిడ్డ జీవితాంతం బలంగా, ఆరోగ్యంగా ఉంటారని.. శిశువు జన్మించిన 6 నెలల వరకు కచ్చితంగా తల్లిపాలు పట్టించాలన్నారు. అనంతరం కిసాన్ జంక్షన్ ఫర్టిలైజర్ దుకాణం, శ్రీరంగాపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, గోదాంను తనిఖీ చేశారు. దుకాణాల బయట ప్రదర్శించిన సమాచార బోర్డులు, దుకాణం, గోదాంలో ఎరువులు, యూరియా నిల్వలను పరిశీలించారు. యూరియా, డీఏపీ నిల్వలు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలతో సరిపోల్చి చూశారు. జిల్లాల్లో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని.. అవసరం మేరకు మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. ఎరువులకు ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఆవసరమైన మేరకు ఎరువులు ఇవ్వాలని.. కృత్రిమ కొరత సృష్టించవద్దని సూచించారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎరువుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, జిల్లా పోగ్రాం అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, వైద్యాధికారి డా. ప్రవళిక, డా. పరిమళ, వ్యవసాయ అధికారులు షేక్ మున్నా, హైమావతి తదిరులు ఉన్నారు.