
నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
కొత్తకోట రూరల్: కానాయపల్లి నిర్వాసితుల సమస్యలు త్వరగా పరిష్కరించి గ్రామ తరలింపు చేపడతామని.. శంకర సముద్రం కుడి కాల్వ ద్వారా 12 గ్రామాల్లోని 8 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని కానాయపల్లి పునరావాస కేంద్రంలో రూ.43.50 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా రూ.75 లక్షలో నిర్మించే వడ్డెర, యాదవ, హమాలీ సామూహిక మందిరాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సువిశాల ప్రాంతంలో సకల సౌకర్యాలతో పాఠశాల నిర్మించినట్లు చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పునరావాస కేంద్రం, ఆయకట్టుకు సాగునీరు అందించలేదని విమర్శించారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముందుగా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించానని చెప్పారు. గ్రామం నుంచి పాఠశాల దూరమైనందున విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలను జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా త్వరలోనే నిర్వాసితులకు ప్లాట్లు ఇచ్చి రావాల్సిన నష్టపరిహారం సైతం అందించి పునరావాస కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పునరావాస కేంద్రంలో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చామని.. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాఠశాలలో ఏఐ విద్య అందించడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మహ్మద్ అబ్దుల్ ఘనీ, మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, బోయేజ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రావుల సురేంద్రనాథ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, పుర కమిషనర్ సైదయ్య, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.