
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
పాన్‌గల్: నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. సోమవారం మండలంలోని కొత్తపేట వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రిని నూతనంగా ఎన్నికై న బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు అక్కల తిలకేశ్వర్‌గౌడ్ కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని నిరంజన్‌రెడ్డి అన్నారు. అనంతరం మాజీ మంత్రి తిలకేశ్వర్‌గౌడ్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేష్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
కనులపండువగా గోదారంగనాథుడి రథోత్సవం
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని గోదాదేవి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం రథాంగ హోమం, రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు గోదాదేవి, రంగనాథస్వామి రథోత్సవం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పర్యవేక్షణలో వేద పండితులు ఉత్సవ మూర్తులైన గోదాదేవి, రంగనాథుడికి పట్టువస్రాలు, ఆభరణాలతో అలంకరించి, వేద మంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో గోదారంగనాథుని రథంపైకి తీసుకొచ్చారు. భక్తులు రథానికి పూజలు నిర్వహించి ఆలయం నుంచి గోవింద నామస్మరనతో రథాన్ని ముందుకు లాగారు. తిరిగి మళ్లీ పూజలు నిర్వహించి రథాన్ని రథశాలకు చేర్చారు. ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
బిజినేపల్లి: మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవోదయ వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం నవోదయ విద్యాలయం లేదా ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు.
కేజీబీవీల్లో ఇంటర్
ప్రవేశాలకు అవకాశం
కందనూలు: జిల్లాలోని 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్‌లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేశ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో సీట్ల ఖాళీలు ఉన్నాయని.. ఆసక్తిగల విద్యార్థినులు ఈ నెల 30వ తేదీలోగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కేజీబీవీల ప్రత్యేకాధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం