అసలేం జరుగుతోంది! | - | Sakshi
Sakshi News home page

అసలేం జరుగుతోంది!

Jul 29 2025 4:29 AM | Updated on Jul 29 2025 10:30 AM

అసలేం

అసలేం జరుగుతోంది!

కలెక్టరేట్‌లో ఆగని చోరీల పర్వం

ఫిర్యాదు చేశాం

మా కార్యాలయంలో ఇటీవల రెండు బ్యాటరీలు, ఒక ఇన్వర్టర్‌, కొన్ని ట్యాబ్‌లు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాం. సీసీ పుటేజీ కేవలం ఐదు రోజుల వరకే ఉంటుందట. ఆ విషయం మాకు తెలియదు. సీసీ కెమెరాలను పరిశీలిస్తే బ్యాటరీలు ఎత్తుకెళ్లిన పుటేజీ లభ్యం కాలేదు.

– డాక్టర్‌ ఎ.శ్రీనివాసులు,

డీఎంఅండ్‌హెచ్‌ఓ

వనపర్తి: జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో బ్యాటరీల చోరీ పరంపర కొనసాగుతోంది. ఏప్రిల్‌ మొదటి వారంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో బ్యాటరీల చోరీకి బాధ్యులు ఎవరనే విషయం తేలకముందే.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఇటీవల రెండు బ్యాటరీలు, ఒక ఇన్వటర్‌, పదికిపైగా ట్యాబ్‌లు చోరీకి గురయ్యాయి. నిత్యం వందలాది మంది ప్రజలు, పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది, పది మందికిపైగా సెక్యూరిటీ గార్డులు ఉండే కలెక్టరేట్‌లో అందరి కళ్లు గప్పి వరుస చోరీలు జరుగుతుండడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రెండు ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో బ్యాటరీల చోరీకి సంబంధించిన విషయమై అధికారుల ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అది కొలిక్కిరాలేదు. వరుసగా ట్యాబ్‌లు అదృశ్యమవుతున్నా దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు పలువురు లేవనెత్తుతున్నారు.

సీసీ కెమెరాల నిర్వహణ లోపం

కలెక్టరేట్‌లో అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా.. వాటి నిర్వహణపై అధికారులు సరైన దృష్టి సారించకపోవటంతోనే వరుస చోరీలు జరుగుతున్నాయి. మొదటిసారి చోరీ జరిగినప్పుడు అధికారులు అప్రమత్తమై సీసీ కెమెరాలకు మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొచ్చామని ప్రకటించారు. కానీ ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బ్యాటరీలు, ఇన్వటర్‌, ట్యాబ్‌లు సైతం ఎత్తుకెళ్లినప్పుడు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగలు పట్టుకుంటారనే నమ్మకం కలిగినా.. గంటల వ్యవధిలోనే అది కూడా నీరుగారిపోయింది. సీసీ కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉండి స్టోరేజీ సామర్థ్యం తక్కువగా ఉన్న సామగ్రిని ఏర్పాటు చేసిన కారణంగా కేవలం ఐదురోజుల పుటేజీ మాత్రమే అందుబాటులో ఉంటుందని తేలటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్‌లైంది. సీసీ కెమెరాలు ఉన్నాయిలే అనే ధైర్యంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చోరీ ఘటన అంశాన్ని నిర్లక్ష్యం చేశారు. వారి నాన్చుడుతో ఐదురోజుల గడువు పూర్తి కావటంతో ఫుటేజీ లభించలేదనే అలవాటైన సమాధానం అధికారుల నోటి నుంచి వినిపిస్తోంది. గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పించే అధికారులు కలెక్టరేట్‌లో వాటి నిర్వహణపై ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో చేటు చేసుకున్న బ్యాటరీలు, ఇన్వటర్‌, ట్యాబ్‌ల చోరీ విషయంపై అందిన ఫిర్యాదు మేరకు నాలుగు రోజులుగా రూరల్‌ పోలీసులు కార్యాలయంలోని అంటెండర్లు, ఇతర సిబ్బందిని విచారిస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించటం లేదని తెలుస్తోంది.

ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించినా కలెక్టరేట్‌ ఏఓ భానుప్రకాష్‌ స్పందించలేదు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావును వివరణ కోరగా.. విషయం తమ వరకు రాలేదని, రూరల్‌ ఎస్‌ఐ విచారణ చేస్తున్నారని తెలిపారు. గతంలో నమోదు చేసిన కేసు విచారణలో ఉన్నట్లు వెల్లడించారు.

వైద్య ఆరోగ్యశాఖలో

రెండు బ్యాటరీలు, ఒక ఇన్వర్టర్‌ చోరీ

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

ఏప్రిల్‌లో చోరీ చేసిన

నిందితులు దొరకలే..

ఇంటి దొంగలా.. బయటి వ్యక్తులా తేల్చాలని డిమాండ్‌

ఫైళ్లు మాయమైతే పరిస్థితి ఏంటి?

ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లా పాలనాపరమైన అన్ని రకాల ఫైళ్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఏ స్థితిలో ఉందనే విషయం అప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఈ–ఆఫీస్‌ విధానాన్ని అమలు చేయాలనే నిబంధనలు జిల్లాలో అమలు కావడం లేదు. ఇలాంటి చోరీలు ఫైళ్ల విషయంలోనూ చోటు చేసుకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

అసలేం జరుగుతోంది! 1
1/1

అసలేం జరుగుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement