వనపర్తి: పోలీసు భద్రత పథకం పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు (పీసీ–508) కుటుంబానికి పోలీసు భద్రత పథకం నుంచి మంజూరైన రూ. 8లక్షల చెక్కును సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వివిధ కారణాలతో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్నిరకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
● పోలీసు ప్రజావాణికి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం నాలుగు అర్జీలు అందగా.. వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.