ప్రజావాణికి 22 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 22 అర్జీలు

Jan 13 2026 7:44 AM | Updated on Jan 13 2026 7:44 AM

ప్రజా

ప్రజావాణికి 22 అర్జీలు

వనపర్తి: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. మొత్తం 22 అర్జీలు వచ్చాయని.. పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధితశాఖల జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 15 వినతులు..

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 వినతులు వచ్చాయి. ఎస్పీ సునీతరెడ్డి పాల్గొని ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వచ్చిన వినతుల్లో భూ తగాదాలకు సంబంధించి 9, భార్యాభర్తల గొడవలకు సంబంధించి 3, పరస్పర ఘర్షణలకు సంబంధించి 3 ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

యువత చేతుల్లోనే

దేశ భవిష్యత్‌ : ఎమ్మెల్యే

వనపర్తిటౌన్‌: భారతదేశ ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. సోమవారం స్వామి వివేకానంద జయంతిని వివేకానంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాకేంద్రంలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశ భవిష్యత్‌కు మూల స్తంభం యువతేనని వివేకానంద చెప్పారని గుర్తుచేశారు. ఆయన మాటలు యువతకు అమూల్య ప్రేరణని, సందేశాలు ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌, పిచ్చయ్య, రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణగౌడ్‌, జిల్లా మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్‌పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు చీర్ల చందర్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బి.కృష్ణ, వైద్యుడు పగిడాల శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నిండుకుండలా

రామన్‌పాడు జలాశయం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో సోమవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్‌ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.

జోగుళాంబ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

అలంపూర్‌: జోగుళాంబదేవి వార్శిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసినట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో వార్శిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వీరితోపాటు ఆలయ అర్చకులు కృష్ణమూర్తిశర్మ, జానకిరామశర్మ తదితరులున్నారు.

ప్రజావాణికి 22 అర్జీలు 
1
1/1

ప్రజావాణికి 22 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement