పకడ్బందీగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు
వనపర్తి: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి అనంతరం సంబంధిత అధికారులతో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. అనంతరం డీఐఈఓ అంజయ్య మాట్లాడుతూ.. ప్రయోగ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని చెప్పారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5,639 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రయోగ పరీక్షలకుగాను జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగుతాయని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పుర ఎన్నికలకు సర్వం సిద్ధం..
జిల్లాలో పురపాలికల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. సోమవారం వార్డుల వారీగా తుడి ఓటరు జాబితా ప్రదర్శించామన్నారు. వీసీ అనంతరం పుర కమిషనర్లకు ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఓటరు జాబితాను అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు అందజేసి అక్విటెన్స్ తీసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. 16వ తేదీన పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు. చనిపోయిన వారు, గ్రామీణ ఓటర్లను జాగ్రత్తగా అన్‌మ్యాప్ చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియకు ఎంపిక చేసుకున్న భవనాల్లో ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలను కమిషనర్లు ప్రత్యక్షంగా పరిశీలించి వసతులు తనిఖీ చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు


