
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్
వనపర్తి: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని.. కాలనీల్లో కొత్త వ్యక్తుల కదలికలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాకేంద్రంలోని రాంనగర్‌కాలనీలో సీఐ ఎం.కృష్ణ, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, 88 మంది పోలీస్ అధికారులు, ఇతర సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 300 ఇళ్లను సోదా చేయగా సరైన ధ్రువపత్రాలు లేని కారు, 3 ఆటోలు, 62 బైక్‌లు గుర్తించి జప్తు చేసినట్లు వివరించారు. వాహనాల యజమానులు సరైన పత్రాలు చూపించి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ, భరోసా, నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిషేధిత గుట్కా, గంజాయి విక్రయం, గుడుంబా తయారీ, రేషన్ బియ్యం, కలప అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని.. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని.. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందన్నారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ మోసపోతే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కొత్తకోట సీఐ రాంబాబు, రూరల్ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి పాల్గొన్నారు.
సరైన ధ్రువపత్రాలు లేని
66 వాహనాలు సీజ్
డీఎస్పీ వెంకటేశ్వర్లు