
కమ్యూనిస్ట్ పార్టీ సజీవం
వివరాలు 8లో..
వనపర్తి రూరల్: ‘అధికారం కోసం పార్టీలు మారే నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందని అంటున్నారు.. సూర్యుడు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉంటుంది.. దేశంలో వందేళ్ల చరిత్రగల ఏకై క పార్టీ సీపీఐ మాత్రమే..’నని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ 100 వసంతాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, మహిళలతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా ఆయన హాజరై వారితో కలిసి నడిచారు. అనంతరం భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులతో కలిసి భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. స్వాతంత్య్రం, తెలంగాణ ప్రజలను నిజాం నుంచి విముక్తి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పార్టీ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం చేశామన్నారు. కార్మిక, కర్షక, పీడిత, తాడిత ప్రజల గొంతుకగా చట్టసభలు, బయట పోరాడుతున్నామని.. పోరాటాల ఫలితంగా దేశంలో పేదలకు ప్రభుత్వ భూమి పంపిణీ, నివేశ స్థలాలు, రైతులకు పంట రుణమాఫీ, పింఛన్లు తదితర అనేక సంక్షేమ ఫలాలు అమలవుతున్నాయని వివరించారు. బీఆర్‌ఎస్ పార్టీ పేదలకు అనేక హామీలిచ్చి.. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్‌పార్టీతో పొత్తు పెట్టుకున్నామని.. హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం చేయడం నీచమన్నారు. కష్టజీవుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని.. సంపన్నవర్గాల వారుండే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కమ్యూనిస్టు పార్టీలంటే చిన్నచూపని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని మోసం చేశారని.. సీపీఐ బలపడితేనే పేదలకు భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలనర్సింహ, కళావతమ్మ, జిల్లా కార్యదర్శి విజయరాములు, పట్టణ కార్యదర్శి రమేష్, శ్రీరామ్, అబ్రహం, గోపాలకృష్ణ, శ్రీహరి, ఎత్తం మహేష్, కృష్ణవేణి, గీత, భూమిక, వంశీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాలు మారినా..
పేదల బతుకులు మారలే
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
సాంబశివరావు