
అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేయాలి
వనపర్తి: వివిధ శాఖల పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఈడబ్ల్యూఐడీసీ శాఖల పరిధిలో ఉన్న బకాయి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ ఫండ్స్ కింద పంచాయతీరాజ్‌శాఖకు కేటాయించిన 44 పాఠశాలలు, ఈడబ్ల్యూఐడీసీకి కేటాయించిన 20 అంగన్‌వాడీ కేంద్ర భవనాలు, ఆర్‌అండ్‌బీకి కేటాయించిన నాలుగు అంగన్‌వాడీ కేంద్ర భవనాల మరమ్మతుల్లో వేగం పెంచాలని సూచించారు. అదేవిధంగా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల పరిధిలో ఎఫ్‌డీఆర్ నిధులతో చేపట్టిన సీసీ రహదారల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి చేయడమే కాకుండా వాటికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కూడా సమర్పించాలన్నారు. మన ఊరు–మన బడికి సంబంధించి తుది దశకు చేరుకొని బిల్లులు రాక పనులు నిలిచిన పాఠశాల భవనాలను గుర్తించి పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. సమావేశంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, ఆర్‌అండ్‌బీ డీఈ సీతారామస్వామి, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ, ఆయా శాఖల డీఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పీఎం విశ్వకర్మ దరఖాస్తులను పరిష్కరించాలి
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఎంపీడీఓలు, పుర కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పీఎం విశ్వకర్మకు ఎంపికై శిక్షణ పొందిన వారికి కలెక్టర్ ధ్రువపత్రాలు అందజేసి మాట్లాడారు. శిక్షణ పొందిన వారంతా సద్వినియోగం చేసుకోవాలని.. శిక్షణనిచ్చిన సింక్రోస్‌సర్వ్ ఏజెన్సీకి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ధ్రువపత్రాలు అందుకున్న వారిలో 37 మంది కుమ్మరి, 33 మంది శిల్పి, మరికొందరు ఇతర చేతివృత్తుల్లో శిక్షణ పొందిన వారు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ఎంఈ ఏడీ శివరాంప్రసాద్ కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ యాదయ్యను శాలువాతో సన్మానించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం జ్యోతి, బిసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, పరిశ్రమలశాఖ అధికారి నాగేష్, ఎల్‌డీఎం కౌశల్ కిషోర్ పాండే, అసిస్టెంట్ ఎల్‌డీఎం సాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రతి దివ్యాంగుడికి గుర్తింపుకార్డు..
ప్రతి దివ్యాంగుడికి గుర్తింపుకార్డు ఉండాలని ప్రభుత్వం యూడీఐడీ (యూనిక్ డిజేబుల్ ఐడి)ని అమలులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, మీసేవా కేంద్రాల నిర్వహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో యూడీఐడీ పోర్టల్ ద్వారానే దివ్యాంగులకు ధ్రువపత్రాలు జారీ చేస్తారని చెప్పారు. కార్డు కోసం దివ్యాంగులు www.swavlam bancard.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసే విషయంలో మీసేవా కేంద్రాల నిర్వాహకులదే కీలక పాత్రని.. వివరాల నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు. ఈ విషయంలో ఎంపీడీఓలు, పుర కమిషనర్లు నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీఎంహెచ్‌ఓ డా.శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి