
అంగన్‌వాడీల హామీలు నెరవేర్చాలి : సీఐటీయూ
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ మంగళవారం జిల్లాకేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా సీఐటీయూ, అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో మర్రికుంట ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీ వెళ్లారు. కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీ ప్రకారం వేతనం రూ.18 వేలకు పెంచాలని, మినీ నుంచి ప్రధాన అంగన్‌వాడీగా మార్చిన టీచర్లకు పది నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేసవిలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా మే నెలలో సెలవులు ఇవ్వాలన్నారు. కొత్త జీఓలు విడుదల చేసి టీచర్లకు రూ.రెండు లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష రిటైర్మెంట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్, పీఎన్ రమేష్, నందిమళ్ల రాములు, మద్దిలేటి, నారాయణమ్మ, కవిత, రమాదేవి, శాంతాబాయి, రాజేశ్వరి, మహేశ్వరి, సంగీత, భారతి, రేణుక, శారద, వెంకటేశ్వరమ్మ, సుమతి తదితరులు పాల్గొన్నారు.