వనపర్తి టౌన్: జిల్లా ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈ రాజశేఖరం చెప్పారు. జిల్లా విద్యుత్‌శాఖ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లోఓల్టేజీ సమస్యను అధిగమించేందుకు వనపర్తి మండలం రాజపేట, పెద్దమందడి మండలం వెల్టూర్, పెబ్బేరు మండలం గుమ్మడం, ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట సబ్‌స్టేషన్‌లలో అదనంగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మరో నాలుగు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరయ్యాయని చెప్పారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు దాదాపు రూ. కోటికి పైగా ఉంటుందన్నారు. వీటి కెపాసిటీ 5 ఎంవీఏ అని తెలిపారు. శ్రీరంగాపూర్, కంచిరావుపల్లి, పెబ్బేరు, చిన్నమందడి తదితర ప్రాంతాల్లో మరో రెండు వారాల్లో వీటిని ఏర్పాటు చేసి విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు లోఓల్టేజీ సమస్యను పూర్తిగా అధిగమిస్తామని తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు
296 మంది గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 7,245 మంది విద్యార్థులకు గాను 6,949 మంది హాజరు కాగా.. 296 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సూర్య ఒకేషనల్ కళాశాల, వాగ్దేవి కళాశాల పరీక్ష కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు. అంతకు ముందు వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు.
రైతులను ఆదుకోవాలనే స్పృహ లేని ప్రభుత్వం
వనపర్తి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యం కేసీఆర్‌ను నిందించడం తప్ప.. పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలనే ధ్యాస, స్పృహ, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి మండలం పెద్దగూ డెం తండాలో రైతు జూలానాయక్ సాగుచేసిన మూడెకరాల వరిపంట ఎండిపోగా.. సోమ వారం మాజీ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెంటు కోతలతో నీరందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సాగునీటి కొరత, కరెంటు కోతలతో హరిగోస పడుతున్నారన్నారు. మరోవైపు మూడెకరాల వరకు రైతుభరోసా సాయం అందించామని చెప్పడం బూటకమని ధ్వజమెత్తారు. ఆర్థికశాఖ, విద్యుత్‌శాఖ, వ్యవసాయశాఖ మంత్రులు సమన్వయంతో పనిచేసి ఉంటే రైతుభరోసా కోసం గోస పడేవారు కాదని.. 448 మంది రైతుల ఆత్మహత్యలు జరిగేవి కావని.. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయ్యేవి కావన్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, ధర్మానాయక్, కృష్ణానాయక్, చిట్యాల రాము, చంద్రశేఖర్, నారాయణ నాయక్, టీక్యానాయక్, రూప్లానాయక్ పాల్గొన్నారు.
యూజీసీ సంస్కరణలను వ్యతిరేకిద్దాం
వనపర్తి విద్యావిభాగం: రాష్ట్ర యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే యూజీసీ నూతన సంస్కరణలను ప్రతి విద్యార్థి వ్యతిరేకించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుకూరి పవన్‌కుమార్ పిలుపునిచ్చారు. యూ జీసీ సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ నెల 26న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించే సదస్సుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజీసీ నూతన సంస్కరణలతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫెలోషిప్‌ల కోత పెట్టారన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా కుట్రలు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సాయికృష్ణ, రాకేష్, ప్రవీణ్, బీచుపల్లి, రాఘవేంద్ర, నరేష్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, ఆంజనేయులు, కార్తీక్, దాసురాం నాయక్ పాల్గొన్నారు.
రామన్‌పాడులో 1,016 అడుగుల నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలశయంలో సో మవారం 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ కాల్వకు 28 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 57, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.