
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
పాన్‌గల్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినుల ఫిర్యాదుకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు ఒకరికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈఓ అబ్దుల్ ఘని బుధవారం రాత్రి తెలిపారు. ఉపాధ్యాయులు చిన్ననాగన్న, రఘురాంను సస్పెండ్ చేయడంతో పాటు కిరణ్‌కు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ప్రవర్తనపై ఈ నెల 6న విద్యార్థినులు ఎంఈఓకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. మరోమారు విచారణ చేసి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి డీఆర్డీఓ ఉమాదేవిని ఆదేశించడంతో ఆమె కూడా ఈ నెల 10న పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించి నివేదిక అందజేశారు. రెండు నివేదికల ఆధారంగా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నట్లు డీఈఓ వివరించారు.
‘ఆదర్శ’ దరఖాస్తు
గడువు పొడిగింపు
పెబ్బేరు రూరల్: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు పెబ్బేరు ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డా. తూర్పింటి నరేష్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీకి మారిందని పేర్కొన్నారు.
ఐసీడీఎస్‌ను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం’
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రైవేటీకరణలో భాగంగా ఐసీడీఎస్‌ను నిర్లక్ష్యం చేస్తోందని.. అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం అనే చట్టాన్ని తీసుకొచ్చిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త విధానం అమలైతే ఐసీడీఎస్ స్వతంత్రంగా ఉండదని.. అనేక మార్పులు చోటు చేసుకొని మూతబడే పరిస్థితికి దారి తీస్తుందని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 17, 18 తేదీల్లో 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చామని.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తామని ప్రకటించి నేటికీ అమలు చేయకుండా వెట్టిచాకిరి చేయించుకుంటోందని మండిపడ్డారు. మినీ అంగన్‌వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చి వారికి 10 నెలలుగా వేతనాలు ఇవ్వలేదడం లేదని చెప్పారు. వెంటనే వారికి బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, నారాయణమ్మ, రాజేశ్వరి, శారద, రేణుక, లత, రామచంద్రమ్మ, సంగీత, భారతి, ఈశ్వరమ్మ, విజయ, సుమిత్ర పాల్గొన్నారు.
ఆలయాల్లో అదనపు
కమిషనర్ విచారణ
అలంపూర్: అలంపూర్ ఆలయాల్లో దేవాదాయ ధర్మాదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు బుధవారం విచారణ జరిపారు. కొద్ది రోజులుగా ఆలయంలోని సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన సందర్శించారు. ఆలయాలకు సంబంధించిన భూములు, టెండర్ల వివరాలు, రోజువారి డీసీఆర్, క్యాష్ బుక్, అన్నదాన విరాళాలు, రసీదు బుక్కులను పరిశీలించారు. అలాగే అన్నదాన సత్రంలోని అన్న ప్రసాద వితరణ, ప్రసాదాల తయారీ, నాణ్యత, వాటి పరిమాణం, కౌంటర్లను తనిఖీ చేశారు. విచారణ నివేదికను దేవాదాయశాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,931
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,931, కనిష్టంగా రూ.5,800 ధరలు లభించాయి. కంది రూ. 6,910–రూ.6,540, మొక్కజొన్నరూ.2,335– రూ.19,66, పెబ్బర్లు రూ.6,210– రూ.5,521, జొన్నలు గరిష్టంగా రూ.4,270, కనిష్టంగా రూ.3,810, ఆముదాలు గరిష్టంగా రూ.6,075, కనిష్టంగా రూ.6,040, పత్తి రూ.5,100 ధరలు పలికాయి.