పల్లెల్లో భూ వివాదాలు..! | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో భూ వివాదాలు..!

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

పల్లెల్లో భూ వివాదాలు..!

తీరని జాయింట్‌ పంచాయితీ

భూమి ఒకరిది..రిజిస్ట్రేషన్‌ మరొకరిది

క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే

ఆటో–మ్యుటేషన్‌

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ యజమానుల ప్రదక్షిణ

ఒక్క ఎల్పీఎంలో 115 మంది పేర్లు..

పరిష్కారానికి దిక్కులేదు

చంద్రబాబు సర్కారు విధానాలతో

అన్నదాత లబోదిబో

రైతులకు అవగాహన కల్పిస్తాం

మా సొంత ఆస్తి..తాతముత్తాతల నాటి నుంచి సాగు చేసుకుంటున్న భూమి రికార్డుల్లో ఒక్కసారిగా వేరేవారి పేరుమీద మారిపోతే మేమెక్కడికి పోవాలి. ఇదీ జిల్లా వ్యాప్తంగా అన్నదాతల నోట వినిపిస్తున్న కన్నీటి ఆక్రోశం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం భూపరిపాలన పేరుతో తీసుకొచ్చిన అనాలోచిత నిర్ణయాలు, తుగ్లక్‌ జీవోలు గ్రామీణ ప్రాంతాల్లో చిచ్చురేపుతున్నాయి. గ్రామ సచివాలయాలు, మీ–సేవల్లో మ్యుటేషన్‌ సేవలను అర్ధాంతరంగా నిలిపివేసి, మండల స్థాయిలో తహసీల్దార్లకు బాధ్యత లేకుండా చేసి నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకే అధికారాలు కట్టబెట్టడంతో పల్లెల్లో భూ వ్యవహారాలు తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి. –విజయనగరం గంటస్తంభం

వారసత్వ భూముల బదలాయింపు ప్రక్రియలో వీఆర్వోలు, తహసీల్దార్లు గతంలో స్వయంగా భూమి వద్దకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన(ఫీల్డ్‌ వెరిఫికేషన్‌) జరిపేవారు. ఆ భూమి వాస్తవంగా ఎవరి అనుభవంలో ఉంది? సరిహద్దులు ఏమిటనేది పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే రికార్డులు మార్చేవారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ వెరిఫికేషన్‌ విధానానికి పూర్తిగా పాతరేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిబ్బంది క్షేత్రస్థాయికి రారు. కేవలం ఆన్‌లైన్‌ డేటా ఆధారంగా ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. ఆ వెనువెంటనే వన్‌బీ రికార్డులు మారిపోతున్నాయి. ఒకరి సర్వే నంబర్‌ పొరపాటున మరొకరి ఖాతాలో ఉన్నా గుడ్డిగా రిజిస్ట్రేషన్లు అయిపోతుండడంతో, తరతరాలుగా సాగుచేసుకుంటున్న అసలైన రైతు రికార్డుల పరంగా నిలువునా భూమిని కోల్పోతున్నాడు.

కుటుంబాల్లో వివాదాలు

కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో సర్కారు తెచ్చిన నిబంధనలు అన్నదమ్ముల మధ్య శాశ్వత శత్రుత్వానికి కారణమవుతున్నాయి. ఒక తండ్రికి ముగ్గురు కొడుకులుండి, వారు లాయర్‌ సమక్షంలో సర్వే నంబర్లతో సహా చట్టబద్ధంగా పార్టిషన్‌ డీడ్‌ రాసుకున్నప్పటికీ.. రిజిస్ట్రేషన్‌ సమయానికి ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు రాకపోయినా మొత్తం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆపేస్తున్నారు. హాజరుకాని సోదరుడి వాటాను చనిపోయిన తండ్రి పేరు మీదే ఉంచి, మిగిలిన ఇద్దరికీ రిజిస్ట్రేషన్‌ చేయండి..పిల్లల చదువులు, ఇతర అత్యవసరాల కోసం అమ్ముకుంటాం అని రైతులు వేడుకుంటున్నా అధికారులు ససేమిరా అంటున్నారు. దీంతో కుటుంబాల్లో గొడవలు ముదిరి కోర్టుల పాలవుతున్నారు.

సమాధానం చెప్పే దిక్కు లేదు

తమ సమస్యలు చెప్పుకుందామని తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లే రైతులకు ఈ వ్యవహారాలతో మాకు సంబంధం లేదు..సబ్‌ రిజిస్ట్రార్ల వద్దకే వెళ్లండి అంటూ అధికారులు చేతులేత్తేస్తున్నారు. అటు సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రైతుల సందేహాలను నివృత్తి చేసే దిక్కులేదు. కొత్త నిబంధనలపై ఎలాంటి ముందస్తు అవగాహన కల్పించకుండా జీవోలు అమలు చేయడంతో అన్నదాతలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

జిల్లాలోని అనేక గ్రామాల్లో జాయింట్‌ ఎల్పీఎం సమస్యలు రైతుల మెడకు ఉచ్చులా మారాయి. గంట్యాడ మండలం, నరవ గ్రామంలోని జాయింట్‌ ఎల్పీఎం నంబర్‌ 3226లో ఏకంగా 115 మంది రైతుల పేర్లు నమోదై ఉన్నాయి. ఈ జాయింట్‌ ఎల్పీఎంలను విడదీసి ఎవరి వాటా భూమి వారికి హద్దులు నిర్ణయించే నాథుడే లేడు. దీనివల్ల బ్యాంకు రుణాలు రాక, భూములు అమ్ములేక, కొనుగోలు చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భూ రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులపై రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం. గ్రామ, మండల స్థాయిల్లో రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, కొత్త విధానంలోని విధివిధానాలు, నిబంధనలను పూర్తిస్థాయిలో వివరిస్తాం. ఏ ఒక్క రైతు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటాం. –సుధాసాగర్‌, ఆర్డీవో, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement