చెరువుల కింద సాగు అనుమానమే
తీవ్ర వర్షాభావం
విజయనగరం ఫోర్ట్:
ఖరీఫ్–2026 రైతన్నకు కలిసిరావడం లేదు. వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో సాగుకు నీరు లేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వర్షాధారంగానే అధికశాతం రైతులు వ్యవసాయం చేస్తారు. సాగునీటి కాలువల కింద సాగు చేసేది చాలా తక్కువ. వర్షాలు పడి చెరువులు నిండితే ఆ నీరు అధారంగా జిల్లాలో ఎక్కువగా పంటలు సాగు చేస్తారు. ముఖ్యంగా జిల్లాలో వరి సాగు అధికం. అయితే ఈఏడాది వరి పంట సెప్టెంబర్ నెల వచ్చినప్పటికీ సగం కూడా సాగవని పరిస్థితి నెలకొంది. ఓవైపు సాగు నీరు లేక పోవడం, మరో వైపు నారు ముదిరిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో చెరువులు 8026
జిల్లాలో చెరువులు 8026 ఉన్నాయి. వాటి పరిధిలో 72 వేల హెక్టార్లలో వరి పంట సాగు చేస్తారు. సాగునీటి కాలువల కింద 40 వేల హెక్టార్లలో సాగు చేస్తారు. 13 వేల హెక్టార్లలో బోరుబావుల కింద సాగు చేస్తారు. ఈ చెరువు ల సాగునీటి సామర్థ్యం 18 టీఎంసీలు కాగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న చెరువుల్లో ఉన్నది కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే. 15 టీఎంసీల కొరత ఉంది. దీంతో పంటపొలాలు సాగుకు నోచుకోని పరిస్థితి. వరుణ దేవుడి కరుణ కోసం రైతులు పూజలు చేస్తున్నప్పటికీ వరుణుడు మాత్రం రైతన్న పట్ల కరుణ చూపని పరిస్థితి నెలకొంది.
బీడు భూముల్లా దర్శనం
జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,02,050 హెక్టార్లు అయినప్పటికీ 1.21 లక్ష ల హెక్టార్ల వరకు సాగయ్యేది. కానీ ఈ ఏడాది సాగునీరు లేక పోవడం వల్ల 45 వేల హెక్టార్లకే వరి పంట పరిమితమైంది. మిగతా పంట లది కూడా అదే పరిస్థితి. సాగు నీరు లేకపోవ డం వల్ల పంట పొలాలు సాగుకు నోచుకోక బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. మొక్కజొన్న, చెరకు, పత్తి, గోగు వంటి పంటలు కూడా చాలా తక్కువగా సాగయ్యాయి.
బొండపల్లి మండలం దేవుపల్లిలో సాగుకు నోచుకోని పంట పొలాలు
జిల్లాలో 8026 చెరువులు ఉన్నాయి. వాటి సామర్థ్యం 18 టీఎంసీలు కాగా కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా యి. పంటల విస్తీర్ణం కూడా తగ్గింది. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతుల కు సూచిస్తున్నాం.
–వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి


