రామభద్రపురం: టీడీపీ నాయకులు, ఏపీఐఐసీ ప్రతినిధులు ఎటువంటి ముహూర్తాన ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి కోసం శంకుస్థాపన చేశారో గాని.. ఆ నాటి నుంచి అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. ఒక్క అడుగు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. పార్కుకు శంకుస్థాపన చేసి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఒక్క పరిశ్రమ రాలేదు. ప్రభుత్వం ఏపీఐఐసీకి విక్రయించిన సుమారు 187.08 ఎకరాల భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు కోసం 20 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేసి చిన్న, పెద్ద పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని చెప్పి గతేడాది మే 10వ తేదీన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బేబీనాయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులు శంకుస్థాపన చేశారు. అయితే పార్కు ఏర్పాటు పనులు ప్రారంభించిన క్రమంలో అదే భూమిలో అప్పటికే సాగులో ఉన్న గిరిజన రైతులకు కనీసం నోటీసులు ఇవ్వడకుండా పత్తి, మొక్కజొన్న, మామిడి, జీడితోటలు, తదితర పంటలను జేసీబీతో ధ్వంసం చేశారు. దీంతో సాగులో ఉన్న భూములలో ఎలా రోడ్లు ఎలా వేస్తారని దాదాపు 11 నెలలు గిరిజన రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తూ అభివృద్ధి పనులను అడ్డుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీఐఐసీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పలుమార్లు గిరిజన రైతులతో సమావేశమై చర్చలు జరిపారు. మొదట్లో చర్చలు విఫలం కాగా.. తర్వాత కాలంలో సాగు రైతులకు సుమారు రూ. 28 లక్షలు పరిహారం ఇచ్చి అడ్డంకులు తొలగించుకున్నారు. అయినప్పటికీ కూడా ఒక్క పరిశ్రమకూడా ఏర్పాటు కాలేదు. కొద్ది రోజుల తర్వాత ఏపీఐఐసీ అధికారులు రాధిక వెజిటబుల్స్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మరో 64.67 ఎకరాలను విక్రయించారు. దీంతో కంపెనీ ప్రతినిధులు నాలుగు రోజుల కిందట పనులు ప్రారంభిస్తుండగా.. ఇదే భూమిలో మాకు 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చిందని, తమ సాగులో ఉన్న భూమిలో పరిశ్రమ ఎలా ఏర్పాటు చేస్తారని పుల్లేరుగుడ్డివలస గ్రామానికి చెందిన గిరిజన రైతులు ప్రశ్నిస్తూ, పనులను అడ్డుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులో పరిశ్రమలు ఏర్పాటవుతాయా అన్న అనుమానం సర్వత్రా నెలకొంది.
రెవెన్యూ అధికారులకు తలనొప్పి..
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధి మిర్తివలస పంచాయతీలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య గల సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి 2017లో విక్రయించింది. అయితే అ భూమిలో ఏపీఐఐసీ సుమారు ఆరేళ్ల వరకు కనీసం ఒక్క పరిశ్రమ పెట్టలేదు సరికదా, భూమి ఎక్కడుందో? ఎలా ఉందో కూడా అధికారులు చూడలేదు. పంటలు పండి గిరిజన రైతులకు ఉపయోగపడే భూములు ముళ్లకంపలతో దర్శనమిస్తున్నాయి. ఇందులో కొంత భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారాయి.
ఏడాదిన్నర కిందట ఎంఎస్‌ఎంఈ
పార్కు కోసం శంకుస్థాపన చేసిన
మంత్రి కొండపల్లి
పనులను అడ్డుకుంటున్న గిరిజన రైతులు
రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి రూ. 7 కోట్లు మంజూరు
ఇంతవరకు ఒక్క పనీ ప్రారంభం కాలేదు


