● ఆత్మీయ గర్జనకు హాజరైన తాజా డీఎస్సీ
ఉపాధ్యాయుల ఆవేదన
● రాజకీయ వివాదాంలోకి తమను
లాగడంపై మండిపాటు
● ఎవరినీ ఎదురించలేని స్థితిలో ఉన్నాం
● ఉపాధ్యాయ సంఘాలు
పట్టించుకోవడం లేదంటూ
ఆవేదన
విజయనగరం అర్బన్: ‘ఆత్మీయ గర్జన’ పేరుతో విశాఖలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమం ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన డీఎస్సీ – 2025 ఉపాధ్యాయుల్లో కొత్త ఆవేదనకు కారణమైంది. జిల్లా నుంచి 450 మంది వరకు టీచర్లు గర్జనకు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వివిధ స్థాయిల్లో విద్యాశాఖ అధికారులు ఒత్తిడి చేశారంటూ పలువురు టీచర్లు వాపోతున్నారు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే రాజకీయంగా వివాదాస్పదమైన అంశంలో తమను భాగస్వాములను చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల భయంతోనే హాజరు..?
కార్యక్రమానికి హాజరవ్వాలని డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, తదితర స్థాయిల్లో ఆదేశాలు వచ్చాయని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉద్యోగంలో కొత్తగా చేరిన తమకు జిల్లా అధికారులను ఎదురించే పరిస్థితి లేదని, పైస్థాయి అధికారుల ఆదేశాలను కాదంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతోనే హాజరయ్యామని కొందరు చెబుతుండడం విశేషం. ‘స్వచ్ఛందంగా వచ్చామా... ఒత్తిడితో వచ్చామా అనేది మాకే తెలుసు. అధికారులు చెప్పిన తర్వాత వెళ్లకపోతే ఏమవుతుందోనన్న భయంతోనే కార్యక్రమానికి వెళ్లాం’ అని కొందరు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ వివాదంలోకి ఎందుకు?
తమకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని... ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడమే తమ బాధ్యతని పలువురు తెలిపారు. అయితే రాజకీయంగా వివాదాస్పదమైన అంశానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడంతో తమపై కూడా రాజకీయ ముద్ర పడుతోంద ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మేం ప్రభుత్వ ఉద్యోగులం.. రాజకీయ కార్యకర్తలం కాదు’ అని ప లువురు డీఎస్సీ–2025 టీచర్లు పేర్కొనడం విశేషం.
‘అధికార పార్టీ టీచర్లు’గా ముద్ర?
కార్యక్రమానికి హాజరైన తమను ఒక రాజకీయ వర్గానికి చెందిన వారిగా భావించే అవకాశం ఉందని తాజా డీఎస్సీ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దీంతో భవిష్యత్‌లో తాము ఎదుర్కొనే పరిస్థితులపై కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే తమపై ఇలాంటి రాజకీయ ముద్ర పడడం తీవ్ర ఇబ్బందికరమని చెబుతున్నారు. అధికారుల సూచన మేరకు హాజరైన తమ పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని వాపోతున్నారు.
ఉపాధ్యాయ సంఘాలు ఎక్కడ?
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడతామని చెప్పే సంఘాలు డీఎస్సీ–2025 టీచర్ల ఆదేదనను మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల ఒత్తిడిపై సంఘాల నాయకత్వం స్పందించకపోవడం, తమకు అండగా నిలవకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సర్వీసు సమస్యలు, ఉద్యోగంలో ఎదురయ్యే ఇబ్బందులు, అధికారుల నుంచి వచ్చే ఒత్తిళ్లపై మాట్లాడేందుకు సంఘాలను ఆశ్రయించినా సరైన స్పందన లేదని కొందరు వాపోతున్నారు.
‘మా గోడు ఎవరికి చెప్పుకోవాలి?’
ఒక వైపు అధికారుల ఒత్తిడి.. మరోవైపు రాజకీయ ముద్ర భయం.. తమ సమస్యలను చెప్పుకోవాల్సిన ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో డీఎస్సీ–2025 టీచర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ‘ఉద్యోగంలో చేరాం.. మా పని మేం చేసుకుంటాం.. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అధికారుల ఒత్తిడిని ప్రశ్నించే పరిస్థితి మాకు లేదు. సంఘాలు కూడా పట్టించుకోకపోవతే ఇంకెవరికి చెప్పుకోవాలి?’ అని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.


