బొబ్బిలి రూరల్: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ క్రీడలకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను పారాది జెడ్పీహెచ్ స్కూల్ ఆవరణలో ఆదివారం చేపట్టారు. సాఫ్ట్‌బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్, సబ్ జూనియర్.. బేస్‌బాల్‌లో సీనియర్ జట్ల ఎంపిక చేపట్టారు. క్రీడాకారుల ఆటతీరు, నైపుణ్యం పరిశీలించిన అనంతరం ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ నెలలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ క్రీడకు ఆదరణ పెంచేందుకు ఇటువంటి ఎంపికలు, శిక్షణ దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు సుంకరి సాయిరమేష్, హెచ్‌ఎం నాగేశ్వరరావు, పీడీలు వెంకటనాయుడు, కిశోర్ అప్పలనాయుడు, శివ, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
టీడీపీ నాయకుడిపై జనసేన నేత ఫిర్యాదు
భామిని: మండలంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య చెలరేగిన వివాదం పోలీస్ ఫిర్యాదుల వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. ఘనసరకు చెందిన జనసేన నాయకుడు మడపాన నరేష్‌కుమార్ (అనిల్) ప్రభుత్వ పథకాల్లో చోటుచేసుకుంటున్న అవకతవకలపై ప్రశ్నిస్తుండడంతో.. టీడీపీ నాయకుడు భూపతి వైకుంఠరావు అతడ్ని బెదిరిస్తున్నాడు. ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువ కావడంతో బాధితుడు నరేష్‌కుమార్ ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయాన్ని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. ఎమ్మెల్యే జనసేన తరఫున గెలవడం, టీడీపీ నాయకులు అజమాయిషీ చెలాయిస్తుండడంతో రెండు వర్గాల మధ్య అంతర్యుద్ధం నెలకొందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె. రవీంద్ర తెలిపారు.
తప్పిన ప్రమాదం..
బలిజిపేట: మండల కేంద్రంలోని అరసాడనాయుడు వీధిలో ఓ ప్రైవేట్ బస్సుకు 33కేవీ లైన్ విద్యుత్ తీగలు తాకడంతో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకేశాడు. అయినప్పటికీ అప్పటికే ఆయన శరీరం కొంతమేర కాలిపోయింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుల్ల రాజు ఇంటిలో ఆడపిల్ల వివాహం జరుగుతోంది. ఈక్రమంలో పెళ్లివారు మక్కువ సమీపంలోని మార్కొండపుట్టి వెళ్లేందుకు గరుగుబిల్లికి చెందిన జి.సురేష్‌కు చెందిన ప్రైవేట్ బస్సును బుక్ చేసుకున్నారు. బస్సు ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోకి వచ్చింది. అయితే రోడ్డుకు పక్కగా బస్సును ఉంచడంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని భావించిన డ్రైవర్ సురేష్ బస్సును పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. పైభాగంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ తల, వీపు, కాళ్లు కాలిపోయాయి. అయినప్పటికీ ఆయన అప్రమత్తమై కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన సురేష్‌ను అరసాయ పీహెచ్‌సీకి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి అక్కడ నుంచి విజయనగరం ఆస్పత్రికి తరలించారు.
ఆటో నుంచి జారిపడిన
వ్యక్తి మృతి
ఆత్రేయపురం: ఈనెల 29న కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి, దర్శనానంతరం ఆటోపై తిరిగి వెళుతూ పిచ్చుకలంక సమీపంలో జారిపడి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా, గుర్ల మండలం, చుక్కపేట గ్రామానికి చెందిన ఆవల రాజారావు (45) వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని షేర్ ఆటోలో తిరిగి వెళ్తూ పిచ్చుక లంక సమీపంలో జారి పడగా తలకు బలమైన గాయమైంది. స్పృహ కోల్పోయిన రాజారావును తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీనిపై ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


