బరితెగించిన ఇసుకాసురులు | - | Sakshi
Sakshi News home page

బరితెగించిన ఇసుకాసురులు

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

ఆందోళనకు దిగిన పుర్లి గ్రామస్తులు

రేగిడి:

సుక అక్రమ తరలింపుతో కాసుల ఆర్జనకోసం వ్యాపారులు బరితెగిస్తున్నారు. అధికార బలంతో రెచ్చిపోతున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. ఇసుక తరలింపునకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా రేగిడి మండలం పుర్లి గ్రామం వద్ద ఇసుక అక్రమ రవాణాకు వీలుగా ఎన్నోఏళ్లుగా ఉన్న నాగావళి నది కరకట్టను పొక్లెయిన్‌తో తవ్వేశారు. దీనిని గమనించిన గ్రామస్తులు మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పొక్లెయిన్‌పై నిల్చొని నిరసన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో 2007లో నిర్మించిన కరకట్ట వల్ల తమ గ్రామంతో పాటు మరో పది గ్రామాలకు ముంపు సమస్య తప్పిందని, ఇప్పుడు ఇసుక అక్రమ తరలింపుకోసం కరకట్టను ఎలా తవ్వేస్తారంటూ ఇసుక వ్యాపారులను నిలదీశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టనట్టుగా వ్యవహరించడంపై మండిపడ్డారు. కరకట్టను తవ్వేయడం వల్ల సాయన్నచానల్‌కు నీటి ప్రవాహం పెరిగి రేగిడి, సంతకవిటి మండలాల్లోని 11వేల ఎకరాల ఆయకట్టు ముంపునకు గురవుతుందని గగ్గోలుపెట్టారు.

ప్రభుత్వం స్పందించి తక్షణమే కరకట్టను తిరిగి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ పాలకుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమవ్యాపారం సాగడం విచారకరమన్నారు. ఆందోళనలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు పాలవలస సూర్యారావు, ఖండ్యాం నీటి సంఘం సభ్యులు పాలవలస ప్రసాదరావు, సురేష్‌, షన్ముఖరావు, బలగ లక్ష్మునాయుడు, పాలవలస రామినాయుడు, శ్రీనివాసరావు, గౌరీశంకర్‌, రవికుమార్‌, నేనుగుల దుర్గారావు, తేగల సిమ్మయ్య, పుర్లి, పరిసర గ్రామాల రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement