ప్రభుత్వం ఆదుకోవాలి
బాబు పుట్టిన నెల రోజులు వరకు బాగానే ఉన్నాడు. నెల తర్వాత కాళ్లు, చేతుల మూమెంట్ ఆగిపోయింది. బెంగళూరులోని న్యూరాలజిస్ట్‌కు చూపిస్తే రూ.16 కోట్లు వైద్యానికి అవుతుందని చెప్పారు. అంత పెద్ద మొత్తం సమకూర్చడం మాకు సాధ్యం కాని పని. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు స్పందించి మా బాబుకు అవసరమైన వైద్యం చేయించాలి.
అనూష, వెంకటేష్, చిన్నారి తల్లిదండ్రులు
విజయనగరం ఫోర్ట్: కొడుకు పుట్టాడని అ తల్లిదండ్రులు ఎంతో సంబర పడ్డారు. కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. బాగా చదివించి డాక్టర్‌నో, ఇంజినీర్‌నో చేయాలని భావించారు. కానీ ప్రాణంతకమైన వ్యాధి ఆ చిన్నారికి పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. పుట్టిన నెలరోజులకే అ చిన్నారికి వ్యాధి బయట పడడంతో తల్లిదండ్రుల సంతోషం ఆవిరిపోయింది. చిన్నారి వైద్యానికి కోట్లాది రుపాయలు అవసరమని వైద్యులు చెప్పడంతో అంత పెద్ద మొత్తం ఏ విధంగా సమకూర్చాలో తెలియక దాతల సాయాన్ని అర్థిస్తున్నారు. విజయనగరం పట్టణంలోని పూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన అనూష, వెంకటేష్ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న మగ శిశువు జన్మించాడు. బాబుకు కాళీకృష్ణ అనే పేరు పెట్టారు. బాబు పుట్టిన నెల రోజులు వరకు బాగానే ఉన్నాడు. తరువాత కాళ్లూచేతుల కదలికలు ఆగిపోయాయి. దీంతో బాబును బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా బాబుకు ప్రాణంతకమైన ఎస్‌ఎంఏ టైప్–1 వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. బాబుకు 6 నెలల లోపు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో చిన్నారి వైద్యానికి దాతలు సహాయం చేయాలని తల్లిదండ్రులు అర్థిస్తున్నారు.
రెండున్నర నెలల చిన్నారికి సోకిన ఎస్‌ఎంఏటైఫ్1 వ్యాధి
నెలరోజుల నుంచి కదలిక ఆగిపోయిన కాళ్లూచేతులు
వైద్యానికి అవనున్న ఖర్చు రూ.16 కోట్లు
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న చిన్నారి తల్లిదండ్రులు


